నర్సన్నను దర్శించుకున్న అక్షరధామ్ స్వామీజీలు..
నర్సన్నను దర్శించుకున్న అక్షరధామ్ స్వామీజీలు..
యాదగిరికొండ, ఆంధ్రప్రభ : ఆధ్యాత్మికతకు నిలయమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ (బీఏపీఎస్) స్వామినారాయణ సంస్థకు చెందిన ప్రముఖ సాధువులు బుధవారం సందర్శించారు. ముంబై అక్షరధామ్ నుంచి విచ్చేసిన భారత దేశ పిల్లల విభాగం ముఖ్య బాధ్యులు పూజ్య అక్షర్ కీర్తన్ స్వామీజీ, ముంబై కేంద్రానికి చెందిన పూజ్య అక్షర్ వల్లభ స్వామీజీలతో పాటు సికింద్రాబాద్ బీఏపీఎస్ మందిర కిచెన్ విభాగం అధిపతి పూజ్య హరినిష్ఠ స్వామీజీలు క్షేత్రానికి చేరుకున్నారు.
ఆలయ అధికారుల ఆహ్వానం మేరకు గర్భాలయంలోని నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామీజీలకు ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికి స్వామి వారి దివ్య ప్రసాదాన్ని, శేష వస్త్రాలను అందజేశారు. అనంతరం అద్భుతమైన శిల్పకళతో పునర్నిర్మితమైన యాదగిరిగుట్ట ఆలయ ప్రాశస్త్యాన్ని, కృష్ణశిలల ప్రాముఖ్యతను స్వామీజీలు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ తిరుపతిగా వెలుగొందుతున్న ఈ క్షేత్రంలోని ఆధ్యాత్మిక వాతావరణం పట్ల వారు ఎంతో ప్రసన్నతను వ్యక్తం చేశారు. భగవంతుని కృప అందరిపై ఉండాలని, లోకకళ్యాణం జరగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ పర్యటనలో స్థానిక బీఏపీఎస్ వాలంటీర్లు, భక్తులు పాల్గొని స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు.
