Ajith Kumar | అజిత్ తల్లి మృతి.. నివాళులు, పరామర్శ

Ajith Kumar | అజిత్ తల్లి మృతి.. నివాళులు, పరామర్శ

Ajith Kumar | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని మణి మృతి తమిళ సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. వయోభార సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలో కన్నుమూశారు. ఆమె మృతితో అజిత్ కుటుంబానికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మోహిని మణి మరణ వార్త తెలిసిన వెంటనే దుబాయ్‌లో ఉన్న అజిత్ కుమార్ అత్యవసరంగా చెన్నైకి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియల ఏర్పాట్లలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు అంత్యక్రియలను అత్యంత సాదాసీదాగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజ‌య్‌ అజిత్ నివాసానికి వెళ్లి మోహిని మణి పార్ధివదేహానికి నివాళులు అర్పించారు. అజిత్‌ను వ్యక్తిగతంగా పరామర్శించి ధైర్యం చెప్పారు. తన అధికారిక ప్రకటనలో “నా ప్రియ మిత్రుడు అజిత్ కుమార్ తల్లి మోహిని అమ్మయ్యార్ మరణ వార్త విని తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యాను” అంటూ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ప్రముఖ నటి Trisha Krishnan కూడా అజిత్ నివాసానికి వెళ్లి మోహిని మణికి నివాళులు అర్పించారు. విజయ్‌తో కలిసి ఆమె అక్కడికి చేరుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అజిత్ కుటుంబ సభ్యులకు ఆమె సానుభూతి తెలియజేశారు.

మోహిని మణి మృతిపై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌, నటుడు క‌మ‌ల్ హాస‌న్‌, ఉదయనిధి స్టాలిన్, ఎడప్పాడి పళనిస్వామి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అజిత్‌కు ధైర్యం చెప్పుతూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు విడుదల చేశారు. అజిత్ సోదరుడు అనిల్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలో, మోహిని మణి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ నిద్రలోనే కన్నుమూసినట్లు తెలిపారు. ఆమె 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు. కుటుంబం గోప్యతను గౌరవించాలని కూడా విజ్ఞప్తి చేశారు.