june7Sunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
june7Sunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

june7Sunday2026 | విశ్రాంత జీవితానికి పుట్టపర్తి ఎందుకు తొలి ఎంపికగా మారుతోంది?
ఆరోగ్య భరోసా, ఆధ్యాత్మిక ప్రశాంతతకు నిలయంగా ప్రశాంతి నిలయం
దేశ విదేశాల వృద్ధులను ఆకర్షిస్తున్న పుట్టపర్తి ప్రత్యేకతలు
రిటైర్మెంట్ తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న సీనియర్ సిటిజెన్స్
సత్యసాయి ఆశీస్సులతో ప్రశాంత జీవనానికి కొత్త నిర్వచనం
june7Sunday2026 | ఉద్యోగం పూర్తయింది… పిల్లలు తమ జీవితాల్లో స్థిరపడ్డారు…సంపాదించాల్సింది సంపాదించారు… ఇప్పుడు ఇంకేం కావాలి? ఈ ప్రశ్నకు చాలా మంది వృద్ధులు చెప్పే సమాధానం ఒక్కటే – “ప్రశాంతత“. ఆ ప్రశాంతత కోసం దేశ విదేశాల నుంచి వేలాది మంది చూపులు ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైపు మళ్లుతున్నాయి.
జీవితమంతా ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార ఒత్తిడులు, కుటుంబ అవసరాల మధ్య పరుగులు పెట్టిన వారు… విశ్రాంతి జీవితంలో మాత్రం ప్రశాంతమైన ఉదయం, ఆరోగ్య భరోసా, భద్రమైన వాతావరణం, ఆధ్యాత్మిక ఆనందం కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారి కలలకు నిలయంగా మారింది ప్రశాంతి నిలయం.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా పేరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పుట్టపర్తి… ఇప్పుడు కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు. విశ్రాంత జీవితం గడపాలనుకునే వారికి ఇది ఒక ఆదర్శ నగరంగా రూపుదిద్దుకుంది. కాలుష్య రహిత వాతావరణం, పచ్చని పరిసరాలు, క్రమబద్ధమైన జీవనశైలి ఇక్కడి ప్రత్యేకత.
వృద్ధాప్యంలో ఎక్కువ మందిని కలవరపెట్టేది ఆరోగ్యమే. ఆ ఆందోళనను తగ్గించే భరోసాగా నిలుస్తున్నాయి పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు జనరల్ హాస్పిటల్. గుండె, మూత్రపిండాలు, నరాల సంబంధిత వ్యాధులతో పాటు అనేక రకాల వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉండటం వృద్ధులకు పెద్ద భరోసాగా మారింది.
అంతే కాదు… స్వచ్ఛమైన తాగునీరు, కోతలు లేని విద్యుత్ సరఫరా, పరిశుభ్రమైన వీధులు, ప్రశాంతమైన కాలనీలు ఇక్కడి జీవన నాణ్యతను మరింత పెంచుతున్నాయి. మహానగరాలతో పోలిస్తే జీవన వ్యయం కూడా తక్కువగా ఉండటం మరో ప్రధాన ఆకర్షణ.
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పదవీ విరమణ పొందిన ఐఏఎస్, ఐపీఎస్, రక్షణ శాఖ, బ్యాంకింగ్, విద్యా రంగాలకు చెందిన మాజీ అధికారులు కూడా ఇక్కడే స్థిరపడుతున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి వచ్చిన అనేక మంది తమ జీవితపు రెండో ఇన్నింగ్స్‌ను పుట్టపర్తిలో ప్రారంభించారు.
కేవలం భారతీయులే కాదు… అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలకు చెందిన భక్తులు కూడా ప్రశాంతి నిలయాన్ని తమ రెండో ఇంటిగా భావిస్తున్నారు. వివిధ దేశాలు, భాషలు, సంస్కృతులకు చెందిన ప్రజలు ఒకే ప్రాంతంలో సామరస్యంగా జీవించడం పుట్టపర్తి ప్రత్యేకత.
ప్రతిరోజూ జరిగే భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వృద్ధుల్లో సానుకూల ఆలోచనలను పెంపొందిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం నడకకు అనువైన విస్తారమైన ప్రదేశాలు, పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, వృద్ధుల కోసం ప్రత్యేక నివాస సముదాయాలు పెరుగుతుండటంతో పుట్టపర్తి మరింత ఆకర్షణీయంగా మారుతోంది.
ఒకప్పుడు భక్తుల అడుగులతో మారుమోగిన ఈ పుణ్యక్షేత్రం… నేడు ప్రశాంతమైన వృద్ధాప్య జీవితాన్ని కోరుకునే వేలాది మంది కలల చిరునామాగా మారింది. జీవితమంతా పరుగులు పెట్టిన తర్వాత… చివరకు మనసుకు విశ్రాంతి దొరికే చోటు ఏదైనా ఉంటే… చాలామంది దృష్టిలో అది ఇప్పుడు ప్రశాంతి నిలయమే.
ప్రశాంత నిలయంలో సేదదీరుతున్న కొందరు సీనియర్ సిటిజెన్స్ ఆనందం వారి మాటలల్లోనే.
ఎం. రామచంద్రరావు, విశ్రాంత బ్యాంకు అధికారి (బెంగళూరు):
“పదవీ విరమణ అనంతరం ప్రశాంతమైన జీవితం కోసం పుట్టపర్తికి వచ్చాం. ఇక్కడ స్వచ్ఛమైన వాతావరణం, ఉచిత వైద్య సేవలు, భద్రతతో కూడిన జీవనం మాకు ఎంతో నచ్చాయి. ఇతర నగరాలతో పోలిస్తే జీవన వ్యయం కూడా తక్కువగా ఉండటం పెద్ద ప్రయోజనం.”
ఎస్. లక్ష్మీదేవి, విశ్రాంత ఉపాధ్యాయురాలు (చెన్నై):
“ప్రశాంతి నిలయంలో నివసించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తోంది. ప్రతిరోజూ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా జీవితానికి కొత్త అర్థం లభించినట్లుగా అనిపిస్తోంది. వృద్ధులకు ఇది అత్యంత అనువైన ప్రదేశం.”
వి. కృష్ణమూర్తి, మాజీ ప్రభుత్వ అధికారి (హైదరాబాద్):
“వృద్ధాప్యంలో ఆరోగ్య సదుపాయాలు చాలా ముఖ్యమైనవి. పుట్టపర్తిలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇతర వైద్య సేవలు ఎంతో భరోసా కల్పిస్తున్నాయి. స్వచ్ఛమైన తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ప్రశాంత వాతావరణం కారణంగా ఇక్కడ స్థిరపడాలని నిర్ణయించుకున్నాను.”
ఇలాంటివారు ఇంకెందరో. భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులు, ఆయన మానవాళిపై కురిపించిన చల్లని కరుణ తోడుగా సేదదీరుతున్న వారు ఎందరెందరో….

కుటాగుళ్ళ ప్రసాద్,
బ్యూరో ఇంచార్జ్,
ఆంధ్రప్రభ,
శ్రీ సత్య సాయి జిల్లా.
+++++++++++++++++++++++++++++++++++++++++

ఏదీ వృధా కాదు
జీవితంలో మనం చాలా సార్లు ” అరె .. అనవసరంగా ఆ పని చేసాం .. వేస్ట్ పని ” అని ఫీల్ అవుతూ ఉంటాం . అయితే మనం చేసే అలాంటి పనులు నిజంగానే వృధా పనులేనా ?? అన్న అనుమానం నాలో .
నాకు తెలిసిన ఒక అబ్బాయి ఒక పెద్ద పరీక్షకు సంవత్సరం పాటు ప్రిపేర్ అయి వ్రాసాడు . తీరా అందులో సెలెక్ట్ కాలేదు . చాలా బాధ పడ్డాడు . అయితే నేను ” నీ కష్టం వృధా కాదు .. అదే సబ్జెక్టు మీద ఉండే వేరే పరీక్షలు వ్రాయి ” అని సలహా ఇచ్చాను . అతను ఆ సలహా పాటించాడు . సక్సెస్ అయ్యాడు . అంటే అతను ఇంతకు ముందు పరీక్ష కోసం చదివింది ఇక్కడ ఉపయోగపడింది అన్న మాట . వృధాకాలేదు అన్న మాట .
అలాగే ..ఈ మధ్య మా ఇంట్లో ఒక వాటర్ ట్యాప్ లీక్ అవడం మొదలు పెట్టింది . నీరు బొట్టు బొట్టు గా కిందికి కారిపోతోంది . ఎందుకైనా మంచిది అని దాని కింద ఒక ప్లాస్టిక్ టబ్ పెట్టాను . అలా బొట్టు బొట్టు గా కారిన నీటితో ఆ టబ్ నిండి పోయింది .
ఒక రోజు మా ఇంట్లో మోటార్ చెడిపోయింది . ఓవర్ హెడ్ టేంక్ లోకి నీళ్లు ఎక్కించడం కుదరలేదు . పైన టేంక్ ఖాళీ అయి ఇంట్లో వాడుకకు నీళ్లు లేకుండా అయిపోయాయి . అప్పుడు ఈ టబ్ లో నీళ్ళే అవసరానికి వచ్చాయి మోటార్ రిపేర్ చేసేంత వరకు . ఇప్పుడు అర్థం అయింది కదా ఏదీ వృధా కాదు అని .
జీవితంలో మనం పడే శ్రమ , నేర్చుకున్న విద్య ఎప్పుడూ వృధా కావు . ఎక్కడో ఒక చోట మనకు పనికి వస్తాయి . కనీసం విలువైన అనుభవం వస్తుంది ఓడిపోయినా కూడా .అంతే కదా ఫ్రెండ్స్ !!!!
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++

ప్రాంతం, జాగీర్
మానవ చరిత్ర మొత్తం అది నిరంతర అన్వేషణ కదా. భూమి ఏర్పడి 4.5 బిలియన్ సంవత్సరాలు అయ్యింది అని ఒక లెక్క. కోట్ల సంవత్సరాలు పరిణామ క్రమం,… మానవుల పూర్వీకులు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పుట్టి, ఉద్భవించి తర్వాత ప్రపంచం అంతా వ్యాపించారు అంటారు.
మొత్తానికి అడవులు, కొండలు, గుహలు, నదీ పరీవాహక ప్రాంతాలు….మానవులు నిరంతర సంచారులు. వారు చెట్లు కాదు పుట్టి చనిపోయేవరకు ఒకే చోట ఉండడానికి! ఇది కనీస ఇంగితం.
మానవుల నిరంతరం ప్రయాణం చేశారు. యుద్ధాలు చేశారు. ఒకరిని ఒకరు చంపుకున్నారు. మంచి వారు చెడ్డవారు, దోపిడీ, బానిస సమాజం….
పాతరాతి యుగం, కొత్త రాతియుగం, చారిత్రక యుగాలు గడిచాయి. జాతులు, సమూహాలు, సమాజాలు, గుంపులు, సంచార జాతులు… అంతా కలగాపులగం గానే మానవ జాతి నడిచింది!
కొన్ని సమూహాలు రక్షణ ప్రాంతాలు కోసం వెతుక్కున్నాయి. ఆహారం, భద్రత, తమ ఆడవారి రక్షణ, కొన్ని రోజుల భవిష్యత్, బ్రతకాలనే కాంక్ష.
ఎందుకంటే యుద్ధం తరవాత అక్కడ మగవారిని చంపి, లేదా బానిసలుగా చేసుకుని, గొలుసులతో బంధించి, వారి స్త్రీలను ఎత్తుకు పోయి, తమ భార్యలుగా, తమ స్త్రీలుగా, లేదా వ్యభిచారులుగా, ఉంపుడు కత్తెలు గా, పని మనుషులుగా చేసుకుని తమ అధికారం సాగినంత కాలం చెలామణీ!
మానవ జాతి చరిత్ర మొత్తం, నిరంతర పోరాటం, స్వార్థం, హింస, రక్తపాతం, అరుపులు, కేకలు, పెడబొబ్బలు, మోసం, దగా, కుట్ర, అబద్ధం, అధర్మం, ఆశ్రిత పక్షపాతం…, అన్నీ కలిసి నడిచాయి!
కొందరు సత్య హరిశ్చంద్రులు ఉన్నారు. కానీ చాలా తక్కువ. “బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు, నరహంతలు ధరాధి పతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి” మహాకవి మాటలు నిజం.
మనుషులు వృక్షాలు కాదు కదిలారు. నదీ ప్రాంతాలు, అడవులు, గుహలు, వ్యవసాయం…, గుంపులు, గ్రామాలు గా నివసించడం…అన్నీ సర్వ సాధారణం!
కొన్ని Basic instincts ఉంటాయి. కుక్కలు తమ Territory లోకి వేరే వాటిని రానీయవు. మొరిగి, అరచి, భౌ భౌ…, అని నానా యాగీ చేసి తరిమి తరిమి తరుముతాయి! మనుగడ కోసం పోరాటం, struggle for existence. Fittest of the Survival.
ఇక్కడ కుక్కలు అభద్రతకు గురి అవుతాయి! వాటి మానసిక ప్రపంచం వేరు.
కానీ మనుషులు నాగరిక సమాజంలోకి వచ్చాము అని డప్పాలు, డప్పులు, కొట్టుకుంటున్నాము కదా!
Law of the land, దేశాలు, రాజ్యాంగం ఏర్పడ్డాయి! ఏది స్థానికత అనేదానికి రాజ్యాంగం కొన్ని సూత్రాలు చెప్పింది.
ఏడేళ్లకు ఒక స్థానికత కొన్ని హక్కులు, అలాగే నాలుగో తరగతి నుంచి చదివితే, లేదా ఇక్కడే పుడితే…., ప్రభుత్వ ఉద్యోగాల్లో హక్కులు…., కేంద్రం, రాష్ట్రం…., కలిసి కొన్ని చట్ట పరమైన హక్కులు, సూత్రాలు ఉన్నాయి.
కొందరు మార్వాడీలు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ…, ధో నంబర్ దందా చేస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది లోకల్ గా పన్నులు కట్టడం లేదు అన్నారు. అది నిజమైతే చట్ట పరమైన చర్యలు తీసుకోండి. ఇదే సూత్రం అన్ని ప్రాంతాల వారికీ వర్తిస్తుంది.
ఉత్తర భారతీయులు దక్షిణ భారతీయులను తక్కువ చేసి చూస్తున్నారు, హీనంగా చూస్తున్నారు, Humiliation చేస్తున్నారు అనేది నిజం. మన ఉద్యోగాలు దోచుకుని మన మీదే పెత్తనం చెలాయిస్తున్నారు అనేది నిజం, దీని కోసం మొత్తం దక్షిణాది కలిసి పోరాడాలి, కింద మన ఐదు రాష్ట్రాలు ఐక్యంగా ఉండాలి.
ఇంకా తెలంగాణ, ఆంధ్ర అని గిల్లి కజ్జాలు సిల్లీగా పెట్టుకుంటే మనల్ని చూసి ఉత్తరాది వారు నవ్వుకుంటున్నారు. సంతోష పడుతున్నారు. వాళ్ళూ వాళ్ళు కొట్టుకుని అసలైన దోపిడీ చేస్తున్నా ఉత్తరాది వారిని కనిపెట్టలేక పోతున్న మన అమాయకత్వమే వారి పెట్టుబడి. వారి రాజకీయ అధికారానికి మూలధనం. ఢిల్లీ పెత్తనం ఇంకా పేట్రేగిపోతోంది. అర్థం చేసుకుని ముఖ్యంగా తెలుగువారు, ఇంగితం, బుద్ధి తెచ్చుకుని మసలుకోండి! ఆల్రెడీ నష్టపోయింది చాలు. గౌరవం కోల్పోయింది చాలు. కళ్ళు తెరవండి.
తెలుగు వారు అక్కడ, గుజరాతీలు ఇక్కడ…., బ్రతుకు తెరువు కోసం అనే మాట బూతు. కేవలం తమ రెక్కల కష్టం మీద బ్రతకడానికి వెళతారు మనుషులు.
ఎవరు ఇంకొకరి ఇంటికి వెళ్తే అన్నం పెట్టరు. కష్టపడి బ్రతికే వారిని, బ్రతకడానికి మా దగ్గరకు వచ్చారు అనడం ఎంతో అవమానం. Sadism. మానసిక దిగజారుడుతనం.
అర్రే, సొంత అన్నదమ్ములు, పాలోళ్ళు, పక్క పక్క ఇళ్ళవాళ్ళు తెలంగాణలో, ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల కత్తులు నూరుకుంటున్నారు. పక్క పక్క ఇళ్లలో ఉంటూ ఇరవై ఏళ్ల నుంచి కనీసం మాటలు లేని కుటుంబాలు ఊరికి, ప్రతీ ఊరులో 10 కుటుంబాలు పైనే ఉన్నాయి అని రీసెర్చ్ చెబుతోంది. మీరు వెళ్ళి క్షేత్ర స్థాయిలో పరిశీలించండి. మీ కుటుంబాల్లో విషయాలు కూడా మీకు తెలుసు. ఎన్ని ప్రేమలు నిజంగా ఉన్నాయో?! కష్టం వచ్చి ఫోన్ చేస్తే చుట్టాలు ఫోనులు కూడా ఎత్తడం లేదు కదా. బంధువులు డొల్లతనం, స్నేహితుల డొల్లతనం అన్నీ మీకు తెలుసు. మీరు బాగుంటేనే బంధాలు. దీనికి ప్రాంతాలతో సంబంధం లేదు. మీ జాగీరు, మా జాగీరు ఉత్త మాటలు. చట్ట ప్రకారం మీకు ఉన్న ఆస్తి మీది అంతే. గోడ కట్టుకో రాజ్యం చేసుకో.
అలా భూములను, కారప్పూస పొట్లాలుగా కట్టి, గోడలు కట్టి కులుకుతున్న, రాజకీయ నాయకులు, అవినీతి పరులు…, వారి మీద యుద్ధం చేయగలరా?!
సొల్లు కబుర్లు చెబుతారా? మాఫియా రాజకీయ పార్టీలు(అవి కొందరి సొంత కంపెనీలు) బిస్కెట్స్ తిని ఇలా మొరుగుతారా? పిచ్చివాళ్ళలా! మీ డొల్లతనం ప్రజలకు తెలుసు. దేవుడికి తెలుసు. ఇక మీ ఆటలు సాగవు. ప్రజలు కళ్ళు తెరిచారు. నిజాలు చూస్తున్నారు. దొంగ ఆటలు గమనిస్తున్నారు.
మనుషుల్లో కొందరు విష జంతువులు ఉంటాయి. నేరపూరిత స్వభావం కొందరు కలిగి ఉంటారు. వారికి చట్ట ప్రకారం శిక్షలు పడాలి. అందరినీ ఒకే గాటన కట్టకూడదు.
ఈ నేల ఎవరి సొంతం కాదు. ఈ భూమి అందరి సొంతం. అసలు భూమిపై గీతలు గీసి, గీతకు అవతల ఒక దేశం, ఇటువైపు ఒక దేశం అనడమే అసహజం. సముద్రం, ఆకాశం, గాలి గీతల శబ్దాలను పట్టించుకోవు. అవి నవ్వుకుంటాయి. మనుషుల సంకుచిత బుద్ధులు చూసి.
ఈ నాగరిక సమాజంలో కూడా ఎంత మరగుజ్జలమై బ్రతుకుతున్నాము?!
ఇది మా అయ్య జాగీరు, ఇది మీ అయ్య జాగీరు కాదు అంటూ కుక్కల్లా దిగజారి పోయి. కుక్క విశ్వాస జంతువు. పోలిస్తే వాటికి అవమానం.
586 సంస్థానాల దేశం. దోపిడీ, పరాయ పాలన, అన్నీ ముగిశాయి. కానీ దోపిడీ రూపం మారింది.
నేటి రాజకీయ మాఫియా దోపిడీ, పగలే రాజమార్గంలో దోపిడీ(చట్టానికి దొరక్కుండా దోచుకోవడంలో నిష్ణాతులు అయిపోయారు, రాజకీయ నాయకులు, పార్టీలు) దేశ ద్రోహం, దబాయింపు, నల్లధనం, హత్యలు, సామ్రాజ్య వాద శక్తులు…., విదేశాల్లో పెట్టుబడులు, ఓట్ల కొనుగోళ్లు, అంతా కలగాపులగం.
ఏదో స్తబ్దుగా జీవిస్తూ…, పెళ్లాలను ప్రేమిస్తూ…., మళ్ళీ కుటుంబ కలహాలు, విడాకులు, అక్రమ సంబంధాలు, సక్రమ సంబంధాలు…, సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు యుద్ధ క్షేత్రాల్లో అభిమన్యులు అయ్యిపోయి ఉన్నారు.
మధ్యలో సత్యం, ధర్మం, ఆధ్యాత్మిక సాధన కొందరికే సాధ్యం. మానసిక ప్రశాంతత కోల్పోయి మనుషులు పిచ్చి వాళ్లు ఐ తిరుగు తున్నారు. నెలజీతం, ప్రైవేట్ ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలీదు.
నిరంతరం, భయం, కన్నీళ్లు, ఆందోళన, కుటుంబ బంధాలు అన్నీ విచ్చిన్నం అయ్యి అన్నదమ్ములు, భార్యా భర్తలు, ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఎవరు ఎవరికి విషం పెట్టి చంపేస్తారో తెలీదు. రేపు సూర్యోదయం కనిపిస్తుందో లేదో తెలీదు.
అహంకారం నయాగరా జలపాతమై మానవులు రక్తంలో ఉరుకు తోంది!
వీటి మధ్యలో వికృత రాజకీయ రాక్షస క్రీడపై ఎవరు పోరాటం చేయగలరు. దేశాల సరిహద్దులు, ప్రతీ దేహం, ప్రతీ దేశం పక్క దేశాన్ని నమ్మక వేల కోట్ల రక్షణ బడ్జెట్…, మిలటరీ, Raw, గూఢచర్యం కోసం డబ్బు, ధనం, మేధస్సు వృథా…, అంతా ఇతర మానవులపై నమ్మకం లేకే కదా! ఇది Barbarian society or Cultured society?!
మరింత గొప్ప సమాజం వైపు అడుగులు వేద్దాం. సత్యమేవ జయతే!
++++++++++++++++++++++++++++++++++++++++++++++

శ్రీవారి నైవేద్య సమయ సూచి గంటా మండపం
తిరుమలేశుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనునిత్యం నైవేద్యాన్ని సమర్పించే సమయాలను తెలియచేసే ఆగమోక్త వ్యవస్థ ఉన్న చోటునే గంటా మండపం అని పిలుస్తారు. స్వామి వారి గర్భాలయ బంగారు వాకిలి ముందున్న ఈ ప్రాంగణాన్ని కొలువు మండపం, మహా మణి మండపం, ముఖమండపం అనే పేర్లతో కూడా ప్రసిద్ధికెక్కింది. నాలుగు వరుసలలో నిర్మితమైన 16 రాతి స్తంభాలతో అలరారుతూ ఉన్న ఈ మండపాన్ని చంద్రగిరి ప్రాంతానికి చెందిన విజయనగర రాజుల మంత్రి అమాత్య మల్లన గా పేరొందిన మాధవ దాసు 1417 లో నిర్మించినట్టు శాసనాధారాలు తెలియచేస్తున్నాయి. ఈ గంటా మండపంలోని దక్షిణ ముఖ స్తంభం పై శ్రీ వరాహ స్వామి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చును
ఈ మండపంలో గర్భాలయ ప్రవేశ ద్వారానికి దక్షిణం వైపున పెద్ద దూలానికి గొలుసులతో వేలాడ కట్టిన రెండు పెద్ద గంటలు ఉంటాయి.
ఈ గంటల కారణంగానే ఈ ప్రాంగణానికి గంటా మండపం అనే పేరు వచ్చింది. ప్రతిరోజూ తిరుమలేశునికి మూడు సార్లు జరిగే ప్రసాద నివేదన సమయంలో ఈ గంటలను మోగిస్తారు. దాదాపు అరగంట పాటు మోగించే ఈ గంటా నాదం తిరుమల కొండల్లో ప్రతిధ్వనిస్తూ స్వామి వారి ఆరగింపు సేవ సమయాన్ని చాటి చెబుతుంది. చంద్రగిరి కోటలో విడిది చేయడానికి వచ్చే విజయనగర రాజ వంశీకులు కొండల్లోని అవ్వాచారి కోన లోయ కు సమీపంలోని నామాల గవి వద్ద ఉన్న ఎత్తైన కొండ శిఖరం పై ఒక గంట స్థంభం ఏర్పాటు చేశారని, తిరుమలేశుని గుడిలో వినిపించే గంటా నాదం విని అక్కడి గంట మోగిస్తే ఆ శబ్దానికి అనుగుణంగా మోగించే విధంగా చంద్రగిరి కొండపై ఇంకో గంట ను ఏర్పాటు చేసుకున్నారని చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి.
వేంకటగిరి రఘునాధ యాదవ రాయల కాలంలో చేసిన ఈ ఏర్పాటు ప్రకారం తిరుమలలో నైవేద్య గంటా నాదం ఆగిన తరువాతనే ఆహారం తీసుకునే విధానాన్ని ఆ రాజవంశాలు పాటించినట్టు తెలుస్తోంది. రాజులు రాచరికాలు కనుమరుగైనా ఆ ఏర్పాట్లకు సజీవ సాక్షిగా నామాల గవి కొండ పైన, చంద్రగిరి కొండ పైన పురాతన గంట స్తంభాలు ఇప్పటికీ కనువిందు చేస్తున్నాయి.
ఓం నమో ‘వేం’కటేశాయ

