శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శాంతిభద్రతల పరిరక్షణ అంటే కేవలం నేరాలను అరికట్టడం మాత్రమే కాదు… ప్రజల్లో భద్రతా భావన కలిగించడం, ఒక నమ్మకాన్ని నెలకొల్పడం కూడా. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, జిల్లా పోలీసు యంత్రాంగం. డీఎస్పీలు, సీఐలు, సిబ్బంది తీసుకుంటున్న చర్యలు ప్రస్తుతం ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన నాయకత్వం ఎస్పీ సతీష్ కుమార్‌దే అని చెప్పాలి. కేసుల పరిష్కారంలో వేగం, నేరాలపై కఠిన వైఖరి, ప్రజలతో సాన్నిహిత్యం — ఈ మూడు అంశాలు ఆయన పనితీరును ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

సాధారణంగా పోలీసుల పని తీరులో లోపాలు కనిపిస్తే విమర్శించడం సహజం. అయితే అదే విధంగా వారు సమర్థవంతంగా పనిచేసినప్పుడు అభినందించడం కూడా సమాజ బాధ్యతే. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పలు ఘటనలను పోలీసులు వేగంగా ఛేదించిన తీరు ఇందుకు నిదర్శనం. హిందూపురంలో 63 ఏళ్ల రాజేశ్వరమ్మపై జరిగిన రాబరీ కేసును కేవలం 10 గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడం పోలీసుల అప్రమత్తతకు అద్దం పట్టింది.

అలాగే నేషనల్ హైవే-44 పై సంచలనం సృష్టించిన హవాలా డబ్బు దోపిడీ కేసును సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, సీడీఆర్ & ఐపీడీఆర్ విశ్లేషణల సహాయంతో ఛేదించి అంతర్‌రాష్ట్ర నేర ముఠాను అరెస్ట్ చేయడం పోలీసుల దర్యాప్తు నైపుణ్యాన్ని చాటిచెప్పింది. కదిరి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలు కూడా ప్రజలకు భరోసానిచ్చాయి. రౌడీ షీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం, వారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా పోలీసులు కేవలం శిక్ష విధించే వ్యవస్థ మాత్రమే కాకుండా మార్పుకు మార్గనిర్దేశం చేసే వ్యవస్థగా నిలుస్తున్నారు.

చిలమత్తూరులో గుప్తనిధుల కోసం ప్రమాదకర తవ్వకాలు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, కదిరిలో జరిగిన చైన్‌స్నాచింగ్ కేసును సీసీ కెమెరాల సహాయంతో వేగంగా ఛేదించడం వంటి ఘటనలు పోలీసుల స్పందనశీలతను స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో పోలీసింగ్‌పై విశ్వాసం మరింత బలపడుతోంది. టెక్నాలజీ వినియోగంలో కూడా జిల్లా పోలీసులు ముందంజలో ఉన్నారు. జిల్లాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ వాహనాల పెంపు వంటి చర్యలు నేరాలను ముందుగానే అరికట్టే దిశగా ఉపయోగపడుతున్నాయి.

వీటి అమలులో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయడం, సమన్వయంతో ముందుకు సాగడం మంచి పరిణామం. అలాగే పోలీసు బదిలీలలో పారదర్శకత, ప్రజాప్రతినిధులతో సమన్వయం వంటి అంశాలు పాలనపై విశ్వసనీయతను పెంచుతున్నాయి. అయితే ప్రజల తరఫున కొన్ని చిన్న చిన్న సూచనలు కూడా ఉన్నాయి. మైనర్ పిల్లల డ్రైవింగ్, రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు చేసే యువతను నియంత్రిస్తే మరింత భద్రత కలుగుతుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ప్రశాంతంగా సంచరించగలుగుతారు. రాత్రి గస్తీ మరింత పెంచాల్సిన అవసరం ఉంది.

అలాగే గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసే వ్యవస్థ మాత్రమే కాదు… సమాజాన్ని సురక్షితంగా, శాంతియుతంగా మార్చే శక్తి అని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు నిరూపిస్తున్నారు. ప్రజల సహకారం, పోలీసుల కృషి ఈ రెండూ కలిసినప్పుడే భద్రత ఒక లక్ష్యం కాదు, ఒక జీవన విధానంగా మారుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ చూపిస్తున్న చొరవ, కేసుల సత్వర పరిష్కారంలో ప్రదర్శిస్తున్న సమర్థత నిజంగా అభినందనీయం.