మిల్లర్లు దళారులయ్యారా..

మిల్లర్లు దళారులయ్యారా..

క్వింటాకు 5 కిలోల తరుగుతో రైతుల ఆవేదన
ధాన్యం దిగుమతుల్లో జాప్యం..
కల్లాల్లోనే పేరుకుపోతున్న బస్తాలు
ఎ.కొండూరు మండల రైతుల గగ్గోలు

ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : రబీ సీజన్‌లో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునే సమయానికి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎ.కొండూరు మండలంలోని పోలిశెట్టిపాడు,కోడూరు, రామచంద్రాపురం, మారేపల్లి, కంభంపాడు, ఎ.కొండూరు తదితర గ్రామాలకు చెందిన రైతులు మిల్లర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు పేరుతో మిల్లర్లు రైతులను రోజుల తరబడి వేచి పెట్టడమే కాకుండా, క్వింటాకు ఐదు కిలోల వరకు తరుగులు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.రబీ ధాన్యం కోతలు పూర్తై పదిహేను రోజులు గడిచినా, కల్లాల్లోనే ధాన్యం నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వర్షాకాల మబ్బులు కమ్ముకుంటుండటంతో ఎప్పుడు వర్షం పడుతుందోననే భయంతో రైతులు రాత్రింబవళ్లు కల్లాల వద్దే కాపలా కాస్తున్నారు. ఆరబోసిన ధాన్యం తడిసిపోతే నాణ్యత తగ్గిపోవడంతో పాటు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా,డీజిల్ కొరత కారణంగా లారీలు అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నప్పటికీ, కొంతమేర ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని మిల్లర్లకు తరలిస్తున్నారు.

అయితే అక్కడికి చేరిన వాహనాలను రెండు మూడు రోజుల పాటు మిల్లుల వద్దే నిలిపివేస్తూ,ధాన్యం దిగుమతులు చేయకుండా రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రవాణా ఖర్చులు, మరోవైపు ఆలస్యం కారణంగా రైతులపై అదనపు భారం పడుతోంది.మండల వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, డీసీఎంఎస్,సివిల్ సప్లై అధికారులు కల్లాల్లో ధాన్యాన్ని పరిశీలిస్తూ, త్వరితగతిన మిల్లులకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మిల్లర్లు సహకరించడం లేదని రైతులు అంటున్నారు.

అధికారుల సమక్షంలో కొంత వేగంగా పనిచేసే మిల్లర్లు, అధికారులు వెళ్లిన వెంటనే మళ్లీ పాత పద్ధతికే వస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇటీవల రైతుల ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ స్పందించి జాయింట్ కలెక్టర్‌ను మండలంలోని మిల్లుల వద్దకు పంపినట్లు సమాచారం. ఆయన సమక్షంలో మిల్లర్లు వేగంగా ధాన్యం దిగుమతులు చేసినప్పటికీ, తరువాత మళ్లీ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని రైతులు చెబుతున్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి,తరుగుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని, కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా కలెక్టర్‌కు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల చెమటోడ్చిన పంటకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని మండల రైతాంగం డిమాండ్ చేస్తోంది.

Leave a Reply