Super-El-nino-Effect : వ‌ర్రీ వ‌ద్దు Andhra Prabha Top Story

Super-El-nino-Effect : వ‌ర్రీ వ‌ద్దు Andhra Prabha Top Story

  • ప్ర‌త్యామ్నాయ‌మే ముద్దు
  • నీటి నిల్వల్లో ఆందోళ‌న‌..
  • పట్టిసీమ.. దిక్కు
  • కృష్ణా డెల్టాలో త‌ప్ప‌దు నీటి ఎద్దడి..
  • తాగునీటికే స‌ర్కారు ప్రాధాన్యం.
  • పంటల బీమా అనివార్యం
  • సూప‌ర్ ఎల్ నినో ఎపెక్ట్

( ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ )

ఖరీఫ్–2026 సీజన్‌లో సూపర్ ఎల్‌నినో ప్రభావం రాష్ట్ర వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో వరి సాగుపై పునరాలోచన చేయాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సూచిస్తున్నాయి.

uper-El-nino-Effect : నీటిమట్టాలు తగ్గుముఖం.

ఎల్‌నినో ప్రభావంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం చేరడం లేదు. ఎగువ ప్రాంతాల్లోని ఆలమట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయిలో నిండకపోవడంతో కృష్ణా డెల్టాకు నీటి లభ్యతపై అనిశ్చితి నెలకొంది. పులిచింతల ప్రాజెక్టులో సుమారు 29 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ వినియోగించదగిన నీరు సుమారు 25 టీఎంసీలే ఉండటంతో వచ్చే ఏడాది జూన్ వరకు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

uper-El-nino-Effect : పట్టిసీము ఆధారం.

కృష్ణా డెల్టాకు ప్రస్తుతం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి నీటిని తరలిస్తున్నప్పటికీ, గోదావరిలో ప్రవాహం తగ్గడంతో 24 పంపుల్లో 20 పంపులతో మాత్రమే నీటిని ఎత్తిపోస్తున్నారు. గతంలో 100 నుంచి 120 రోజులపాటు అందుబాటులో ఉండే గోదావరి నీరు ఇప్పుడు 60 నుంచి 70 రోజులకు మాత్రమే పరిమితమవుతోంది. గోదావరి డెల్టా అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో కృష్ణా డెల్టాకు నీటి సరఫరాపై కూడా ప్రభావం పడుతోంది. ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటిని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని సుమారు 60 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాల కోసం చెరువులు నింపేందుకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిస్థితుల్లో తగినంత నీటి నిల్వలు లేకుండానే వరి సాగు చేపడితే మధ్యలో నీటి కొరత ఏర్పడి రైతులు భారీగా పెట్టుబడులు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రuper-El-nino-Effect : త్యామ్నాయ పంటలే మేలు…

అందుకే రైతులు పరిస్థితులను అంచనా వేసుకుని వరికి బదులుగా మొక్కజొన్న, జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది, వేరుశెనగ వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో నమోదు కావాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతున్న “వేసిన ప్రతి పంటకూ… బీమా చేయాల్సిందే” అనే అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పంటల బీమా చేయించుకోవడం ద్వారా రైతులు ఆర్థిక భరోసా పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులు సంప్రదాయ సాగు విధానాలకు బదులుగా పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, నీటి వినియోగం, పంటల బీమాపై దృష్టి సారిస్తే నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని వ్యవసాయ వర్గాలు సూచిస్తున్నాయి.