గోదావరి పరివాహక ప్రాంతాలకు శాశ్వత రక్షణ: మంత్రి సీతక్క
కరకట్ట పనులు వేగవంతం.. వరద ముప్పు తగ్గింపే లక్ష్యం
ఏటూరునాగారం, ఆంధ్రప్రభ: గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు.
శనివారం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి, జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించగలిగామని పేర్కొన్నారు.
గోదావరి కరకట్ట పనులను వేగంగా పూర్తి చేసి వరద ముప్పును శాశ్వతంగా తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
వరదల సమయంలో ప్రజలు వాగులు, నదులు దాటేందుకు ప్రయత్నించవద్దని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
