ఆరోగ్య సేవల్లో అగ్రస్థానమే లక్ష్యం..
- కీలక పనితీరు సూచికలపై వైద్యాధికారులతో డీఎంహెచ్వో డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు సమీక్ష
- మాతా–శిశు సంరక్షణ, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
- క్షేత్రస్థాయిలో పరిశుభ్రత, దోమల నియంత్రణపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
విజయవాడ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాను ఆరోగ్య సేవల్లో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు శనివారం తన కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదే సమయంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమగ్రంగా సమీక్షించారు. సమావేశంలో కీలక పనితీరు సూచికలు (కేపీఐ) కింద నిర్దేశించిన లక్ష్యాల సాధనలో ప్రతి వైద్యాధికారి పనితీరును సమీక్షించారు.
ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వేగం పెంచి ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. మాతా–శిశు సంరక్షణ కార్యక్రమాల అమలు, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఆరోగ్య అవగాహన కల్పించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ప్రతిరోజూ నిర్ణీత సమయానికి ముఖ ఆధారిత హాజరు నమోదు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని డీఎంహెచ్వో ఆదేశించారు. గ్రామాలు, కాలనీల్లో పరిసరాల పరిశుభ్రత, సురక్షిత తాగునీరు, దోమల నివారణ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో అమలవుతున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాల్లో మెరుగైన ఫలితాలు సాధించే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
