రాజకీయాలకతీతంగా స్కూళ్ల అభివృద్ధి
రాజకీయాలకతీతంగా స్కూళ్ల అభివృద్ధి
- సమాజ సేవకే తొలి ప్రాధాన్యత
- డైనింగ్ హాల్, గదుల నిర్మిస్తా..
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
చిగురుమామిడి, ఆంధ్రప్రభ : రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తానని, సమాజ సేవకే తన తొలి ప్రాధాన్యత అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ పాఠశాలలో టిఫిన్ బైఠక్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సద్ది తెచ్చుకుని.. స్థానికులతో కలిసి ఆరగించారు. అనంతరం రేకొండ స్కూల్లో పరిశుభ్రతపై ఆయన చర్చించారు. అనంతరం మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా స్కూల్ను శుభ్రపరచాలని, ఎంపీ అయ్యాక సమాజసేవకే ప్రాధాన్యతనిస్తున్నానని వెల్లడించారు.
స్కూల్ సమస్యలను అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి విద్యార్థులకు డైనింగ్ సౌకర్యం లేదని టీచర్లు చెప్పడంతో వెంటనే స్పందించి డైనింగ్ హాల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలకు తరగతి గదుల సమస్య ఉందని ఏకరువు పెట్టగా, సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల డైనింగ్ కోసం రూ.5 లక్షల సాయం చేస్తానని ప్రకటించారు.
అలాగే ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి రూ.20 లక్షల సాయం చేస్తానని, తొలి విడతగా రూ.10 లక్షలు అందిస్తానని హామీ ఇచ్చారు. రేకొండ స్కూల్లో టెన్త్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కేంద్ర మంత్రి అభినందించారు. ఈసారి కూడా టెన్త్ విద్యార్థుందరికీ ఉచితంగా సైకిళ్లు అందిస్తానని స్పష్టం చేశారు. మోదీ 12 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్థానికులను కోరారు. అనంతరం మోదీ పాలనా విజయాల బుక్ లెట్లను హెచ్ఎం విజయ లక్ష్మికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అందజేశారు.
