India Political Realignment | మారుతున్న రాజకీయ బంధాలు.. కొత్త సమీకరణాల ఆరంభం
India Political Realignment | మారుతున్న రాజకీయ బంధాలు.. కొత్త సమీకరణాల ఆరంభం
India Political Realignment | తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక – బీజేపీ వైపు వాలింపు
దక్షిణాదిలో రాజకీయ సమీకరణాల మార్పు
తమిళనాడు రాజకీయాల్లో కొత్త మలుపులు
బెంగాల్, కేరళలో శక్తి సమీకరణాలు
భవిష్యత్ రాజకీయ దిశ
India Political Realignment | అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాభవం చెందిన తృణ మూల్ కాంగ్రెస్ దాదాపు నిలువునా చీలిపోయి, ఓ వర్గం బిజెపితో కలుస్తోంది అనేది ఇప్పటికి సంచల వార్త. ముఖ్య మంత్రి పీఠం నుంచి వైదొలగనని భీష్మించుకున్న మమతా బెనర్జీ చివరకు బేలగా మారి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ “కలిసి పోదాం రా” అనే ఆహ్వానాన్ని అందుకునే పరి స్థితికి జారిపోతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఓడిపోయిన డీ.ఎం.కె.పార్టీ కాంగ్రెస్తో విభేదించింది కనుక తప్పనిస రిగా బి.జె.పి.కి అంశాల వారీగా నైనా దగ్గరయ్యే అవకాశం లేకపోలేదని ఇంకో వైపు నుంచి రాజకీయపు వాసన గుప్పు మంటున్నది. ఈ రెండింటికి పరాకాష్ట అనే రీతిలో బి.జె.పి. నాయకుడు అమిత్ షా ముందు ముందు మరే పార్టీతో పొత్తు పెట్టుకోకుండా, ప్రతిచోటా సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించడం.
దీని ఫలితంగా బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రాజకీయ సమీకరణాలు తప్పక మారవచ్చుననే రాజకీయ జ్యోతిష్యం, మరోవైపు ఉండనే ఉంది. ఐదారు వారాలుగా ఢిల్లీకి బయట మద్రాసు, త్రివేండ్రం, కలకత్తా, బెంగళూరు నగరాలు వరుసగా రాజకీయ వార్తల కేంద్రాలకు నెలవులుగా మారడమనేది గుర్తుంచుకోదగ్గ సందర్భంగా మిగిలిపోతుంది.
స్థూలంగా దక్షిణాదిలో కాంగ్రెస్ మరింత విచ్చుకుంటే, ఉత్తరాదిలో బిజెపి ఇంకొంత బలపడుతుంది. రాజకీయంగా కాకలు తీరిన పినరయి విజయన్, మమతా బెనర్జీ, ఎం.కే. స్టాలిన్ ఒకేసారి అధికారాన్ని కోల్పోవడంతో దేశవ్యాప్త రాజకీయాలకు రంగు, రుచి మారిపోయాయి. ఇంకా చెప్పాలంటే ఆ మారడం ప్రారంభించిన తర్వాత పూర్తిగా కుదుటపడలేదు కూడా.
ఇప్పుడు ఈ తేటపడటమనేది క్రమంగా ఢిల్లీలో తేటతెల్లమవుతున్నది. బి.జె.పి. మిత్రులు మారవచ్చు, కాంగ్రెస్ మిత్రులలో మరింత అన్యోన్యత పెరగవచ్చు. మరో రకంగా చెప్పాలంటే కొన్ని పార్టీల ముసుగులు తొలగిపోతున్నాయి, మరికొన్ని పార్టీలకు కొత్త ముసుగులు తయారవుతున్నాయి.
1999లో తుగ్లక్ పత్రికను ప్రారంభించిన ఎడిటర్, జర్నలిస్టు, నటుడు, రాజకీయ నాయకుడు చో రామస్వామి ఐదేళ్ల తర్వాత అన్నాడి. ఎం.కే. జయలలిత వైపు మొగ్గు చూపారు. 2004 నుంచి బలపడిన కాంగ్రెస్, డి.ఎం.కె. అనుబంధం ఆ పార్టీల చరిత్రలో దాదాపు సుదీర్ఘమైనది. కరుణానిధి కూతురు జైలు పాలైనా డి.ఎం.కె. కాంగ్రెస్ ను దూరం పెట్టలేదు.
అంతటి 22 ఏళ్ల బంధాన్ని కాంగ్రెస్ ఎందుకు పుటుక్కుమని ముందే తెంచేసుకొని, విజయ్ టీ.వీ.కె పార్టీతో చేతులు కలిపిందో బహిరంగంగా చెప్పబడలేదు. ఒక దశలో అన్నా ఎం.కే. పళనిస్వామి, మరో దశలో సినిమా హీరో రజనీకాంత్ ముఖ్యమంత్రికావచ్చని చర్చలు పార్టీల మధ్య జరిగాయని లోగుట్టు సమాచారం అప్పట్లో వినబడింది.
అన్నాడీ. ఎం.కే. పార్టీ మొదలైనప్పటి నుంచి రెండు ద్రావిడ పార్టీలలో ప్రతి ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ఏదో ఒకదానితో జత కట్టినట్టు చరిత్ర చెబుతోంది. బిజెపి 1999లో డి.ఎం.కె.తో కలిస్తే, 2004లో అన్నాడీ.ఎం.కే.తో కూడింది.
ఈ రెండు ద్రావిడ పార్టీల మధ్య రాజకీయ వివక్ష దాదాపు లేదు, అయితే అదే సమయంలో అస్పృశ్యత తమ రెండింటి మధ్య ఉంటూ వచ్చింది. విజయ్ పార్టీని అధికారానికి దూరం చేయడానికి డి.ఎం.కె., అన్నాడీ.ఎం.కె. లోపాయికారిగా చేతులు కలిపాయని వార్త అప్పట్లో సంచలనమే.
‘తుగ్లక్’ ఎడిటర్ ఎస్. గురుమూర్తి ఈ రెండు ద్రావిడ పార్టీల రాజకీయ ముసుగులను పటాపంచలు చేశారు. మొత్తానికి తమిళనాడు పొలిటికల్ కాన్వాస్ పూర్తిగా మారిపోతోంది, అందులో తాజా పోకడ అన్నామలై కొత్త రాజకీయ ప్రకటన.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీలో ఓ చీలిక బిజెపిలో కలిసి దానికి అవసరమైన సుస్థిరతను ఇస్తే, మిగిలిన వర్గం కాంగ్రెస్ తో కలిసిపోవడం సంభవిస్తే వారి రాజకీయ తక్షణ అవసరాలు తీరవచ్చు.
దీనితో కేరళలో రాజ్యాధికారాన్ని కోల్పోయిన సి.పి.ఐ.(ఎం) పశ్చిమ బెంగాల్లో కొత్త జవసత్వాలను సంతరించుకోవచ్చు. చివరికి అది మూడు ప్రధాన రాజకీయ పక్షాలను రెండింటికి కుదించవచ్చు.
అంతకాలం అధికారాన్ని చెలాయించిన మార్క్సిస్టు పార్టీ ఎలా మమతా బెనర్జీకి పదవిని కట్టబెట్టిందో దూరంగా ఉన్న మనకు సరిగా బోధపడటం లేదు. అదే రీతిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంత ఆందోళనకరంగా దానికి దూరమైందో ఇప్పటికీ పూర్తిగా అర్థం కావటం లేదు.
ఢిల్లీ స్థాయి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తిరస్కరించిన సిద్ధరామయ్య చేతులు కట్టుకొని ఎలా కూర్చుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పై ఈడి దాడులు రాజకీయ స్ఫూర్తితో జరగడం లేదని వివరణలు ఇచ్చినప్పటికీ నమ్మడానికి కొందరు సిద్ధంగా లేరు.
ఎం.కే. స్టాలిన్ ఆరు నెలల పాటు విమర్శలు చేయనని చెప్పి, రెండు వారాల్లోనే ఆ మాటను వమ్ము చేసి విజయ్ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కారణంగా మారిన రాజకీయ పునరేకీకరణల నేపథ్యంలో బిజెపి వీగిపోయిన బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టి విజయం సాధించే ప్రయత్నం చేస్తుందా? ఈ మారిన రాజకీయ బంధాల మధ్య అన్యోన్యతను మరింత గాఢం చేస్తాయా అన్నది ముందు ముందు చూడాలి.
-డా.నాగసూరి వేణుగోపాల్
