విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్
ఆశ్రమ పాఠశాలలో విద్యా బోధన, వసతులను పరిశీలించిన అధికారులు
ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యా బోధన, వసతి సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్లిన వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు.

మంగళవారం పర్వతగిరి గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా, వసతి సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థులతో మమేకమయ్యారు.
విద్యార్థులను చదువు, వసతి, భోజనం తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు. ఐపీఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, ఐఏఎస్ అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తమతో కలిసి భోజనం చేయడంతో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.
