తేడాను గుర్తిస్తే.. ప్రాణాలకు రక్షణ!

తేడాను గుర్తిస్తే.. ప్రాణాలకు రక్షణ!

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఛాతిలో నొప్పి వస్తే చాలామంది అది గుండెపోటేనని భయపడుతుంటారు. అయితే ప్రతి ఛాతి నొప్పి గుండెపోటు కాదు. కొన్ని సందర్భాల్లో అది కండరాల నొప్పి, గ్యాస్, అజీర్ణం లేదా ఒత్తిడి కారణంగానూ రావచ్చు. అయితే గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించడం ప్రాణాలను కాపాడే అవకాశం కల్పిస్తుంది. సాధారణ ఛాతి నొప్పి ఎక్కువగా కొన్ని సెకన్లు లేదా కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. కొద్దిసేపటికి తగ్గిపోయి మళ్లీ రావచ్చు. కానీ గుండెపోటు సమయంలో వచ్చే నొప్పి సాధారణంగా 20 నిమిషాలకుపైగా కొనసాగుతుంది. విశ్రాంతి తీసుకున్నా లేదా మందులు వాడినా వెంటనే తగ్గకపోవడం గుండెపోటు సంకేతంగా భావించాలి.

నొప్పి స్వభావంలో కూడా తేడా ఉంటుంది. సాధారణ ఛాతి నొప్పి గుచ్చినట్లు, మంటగా లేదా ఒక చిన్న ప్రాంతంలో మాత్రమే అనిపిస్తుంది. గుండెపోటు సమయంలో మాత్రం ఛాతిపై భారీ బరువు పెట్టినట్లు, బిగుసుకుపోయినట్లు లేదా నొక్కుతున్నట్లు అనిపిస్తుంది. చాలామంది దీనిని “ఛాతిపై ఏనుగు కూర్చున్నట్లు ఉంది” అని వర్ణిస్తారు. నొప్పి వచ్చే ప్రాంతాన్ని కూడా గమనించాలి. సాధారణ ఛాతి నొప్పి ఒకే చోట పరిమితమై ఉంటుంది. గుండెపోటు నొప్పి మాత్రం ఛాతి మధ్యలో లేదా ఎడమవైపు మొదలై ఎడమ చేయి, రెండు చేతులు, మెడ, దవడ, వీపు లేదా పై పొట్ట వరకు వ్యాపించే అవకాశం ఉంటుంది.

సాధారణ ఛాతి నొప్పికి కండరాల ఒత్తిడి, గ్యాస్, అజీర్ణం లేదా ఆందోళన వంటి కారణాలు ఉండొచ్చు. శరీర భంగిమ మార్చడం, విశ్రాంతి తీసుకోవడం లేదా అజీర్ణానికి మందులు తీసుకోవడం వల్ల అది తగ్గుతుంది. కానీ గుండెపోటు నొప్పి ఎక్కువగా శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి తర్వాత మొదలై విశ్రాంతితో కూడా తగ్గకపోవచ్చు. ఇతర లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. గుండెపోటు సమయంలో అధిక చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, తల తిరగడం, అకస్మాత్తుగా తీవ్ర అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణ ఛాతి నొప్పిలో ఇవి ఎక్కువగా ఉండవు.

ఛాతి నొప్పి 20 నిమిషాలకుపైగా కొనసాగినా, లేదా పై లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సేవలను సంప్రదించాలి. స్వయంగా గుండెపోటు కాదని నిర్ణయించుకోవడం ప్రమాదకరం. సరైన సమయంలో వైద్యం అందితే ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. నొప్పి ఏది ఉన్న డాక్టర్ గూగుల్ సలహాలను తీసుకోని నిర్ధారణకు రావద్దు. సరైన నిపుణుల సహాయం తీసుకున్న తరువాతే ఒక నిర్థారణకు రావాలి.