కామన్వెల్త్ పతక విజేతకు శాప్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం

  • మరిన్ని పతకాలు సాధించాలి
  • ఎల్లప్పుడూ అండగా ప్రభుత్వం
  • పతకం వచ్చిన తర్వాత కాదు.. ముందే ప్రోత్సాహం..
  • శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తున్నాం
  • ఆసియా, ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే తదుపరి లక్ష్యం
  • క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తోంది
  • శాప్ చైర్మన్ ఏ. రవి నాయుడు
  • కామన్వెల్త్ పతకం ఏపీ వెయిట్‌లిఫ్టింగ్ సత్తాకు నిదర్శనం
  • శాప్ ఎండీ ఎస్. భరణి

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: కామన్వెల్త్ పోటీల్లో రజిత పతకం సాధించిన అజయ్ బాబు విజయం వ్యక్తిగత విజయంగా కాదు.. దేశ గౌరవంగా, తెలుగు జాతి ఆత్మగౌరవంగా ప్రభుత్వం భావిస్తోందణి, పతకం సాధించిన తర్వాత సన్మానించడం మాత్రమే కాదు.. పతకం సాధించే స్థాయికి చేరుకునే వరకు ప్రతి అడుగులోనూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ ఏ. రవి నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఉన్న శాప్ ప్రధాన కార్యాలయంలో కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్ అజయ్ బాబును ఘనంగా సన్మానించిన అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ.. అజయ్ బాబు సాధించిన రజత పతకం రాష్ట్రానికి, తెలుగు జాతికి ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిందని రవి నాయుడు కొనియాడారు. ఈ విజయం వెనుక క్రీడాకారుడి కఠోర శ్రమ, అంకితభావంతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఒకే కుటుంబం నుంచి కామన్వెల్త్ స్థాయిలో పతక విజేతలు రావడం అరుదైన విషయమని, అజయ్ బాబు కుటుంబం రాష్ట్ర క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల పట్ల అనుసరిస్తున్న విధానం గత ప్రభుత్వాలకు భిన్నమని తెలిపారు.

పతకాలు సాధించిన తర్వాత అభినందించడం మాత్రమే కాకుండా, అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్న దశ నుంచే ఆర్థిక సహాయం, శాస్త్రీయ శిక్షణ, అవసరమైన మౌలిక సదుపాయాలు, పోటీ అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో క్రీడారంగానికి అత్యున్నత ప్రాధాన్యం లభిస్తోందని రవి నాయుడు తెలిపారు. కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ముందుగానే ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని చెప్పారు. అజయ్ బాబుకు కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా నిలిచిందని, భవిష్యత్తులోనూ అదే సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం అందించే సహాయం కేవలం నిధులు కాదు… క్రీడాకారుడికి కుటుంబ సభ్యుడిలా అండగా నిలిచే బాధ్యతవాణి, ప్రతి క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని అందరూ కోరుకుంటున్నా అన్నారు.కామన్వెల్త్‌తో ఆగకుండా ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించే వరకు ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని రవి నాయుడు పేర్కొన్నారు. శాప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. భరణి మాట్లాడుతూ.. అజయ్ బాబు విజయం ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టింగ్ సత్తా కు నిదర్శనమని అన్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో రాష్ట్రానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, అజయ్ బాబు ఆ వారసత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. ఆయన విజయం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని, రాబోయే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించేలా శాప్ తరఫున అన్ని విధాలా మద్దతు అందిస్తామని భరణి తెలిపారు. అజయ్ బాబు సాధించిన విజయం ఒక్క వ్యక్తి విజయమే కాదని, రాష్ట్ర క్రీడా విధానానికి లభించిన గుర్తింపుగా ప్రభుత్వం భావిస్తోందని, ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు మరింత సత్తా చాటేలా అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.