శిథిల భవనాల్లో కొనసాగుతున్న ప్రీమెట్రిక్ హాస్టళ్లు..
అద్దె భవనాల్లోనే పోస్టుమెట్రిక్ వసతి గృహాలు..
కారుతున్న పైకప్పులు, ఇరుకు గదులు, మరుగుదొడ్ల కొరతతో విద్యార్థుల ఇబ్బందులు..
తక్షణమే మరమ్మతులు, సొంత భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి
భైంసా, ఆంధ్రప్రభ: పేద, గ్రామీణ విద్యార్థులకు సురక్షిత వసతి, పోషకాహారం, ప్రశాంతమైన విద్యా వాతావరణం కల్పించాల్సిన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు సమస్యల నిలయాలుగా మారుతున్నాయి. చదువుపై దృష్టి పెట్టాల్సిన విద్యార్థులు శిథిల భవనాలు, కారుతున్న పైకప్పులు, ఇరుకు గదులు, మరుగుదొడ్ల కొరత, కనీస వసతుల లేమితో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భైంసా నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శిథిలావస్థలో ప్రీమెట్రిక్ హాస్టళ్లు
నియోజకవర్గంలోని పలు బీసీ, ఎస్సీ ప్రీమెట్రిక్ వసతి గృహాలకు సొంత భవనాలు ఉన్నప్పటికీ ఏళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. భవనాల స్లాబుల నుంచి పెచ్చులు ఊడిపడుతుండగా, వర్షం పడితే పైకప్పుల నుంచి నీరు కారి గదులు తడిసిపోతున్నాయి. ప్రమాదకర పరిస్థితుల్లోనే విద్యార్థులు అక్కడ నివాసం ఉంటున్నారు. అనేక హాస్టళ్లలో సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేక పరిశుభ్రత సమస్యలు తలెత్తుతున్నాయి.
కారుతున్న గదుల్లోనే వంటలు
భైంసా పట్టణంలోని బీసీ బాలుర ప్రీమెట్రిక్ హాస్టల్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. శిథిలమైన భవనం పైకప్పు నుంచి వర్షపు నీరు కారుతున్నప్పటికీ అదే భవనంలో వంటలు, భోజనాలు కొనసాగుతున్నాయి. సరకుల నిల్వ గది, కార్యాలయం కూడా శిథిలమైన గదుల్లోనే నిర్వహిస్తున్నారు. గతేడాది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒకే గదిలో విద్యార్థులు నిద్రిస్తున్నారని, భవనం ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో రోజులు గడుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
అద్దె భవనాల్లో పోస్టుమెట్రిక్ హాస్టళ్లు
పోస్టుమెట్రిక్ హాస్టళ్లకు ఇప్పటికీ సొంత భవనాలు లేకపోవడంతో బీసీ, ఎస్సీ బాలబాలికల వసతి గృహాలు పూర్తిగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ భవనాలు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో వారు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. ఇరుకు గదుల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను ఉంచడం వల్ల చదువుకు అనువైన వాతావరణం లేకపోవడంతో పాటు అంటువ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. తగిన డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, స్నానాల గదులు లేక ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి.
బాలికలకు అధిక ఇబ్బందులు
భైంసా పట్టణంలోని ఎస్సీ బాలికల పోస్టుమెట్రిక్ హాస్టల్ కూడా అద్దె భవనంలోనే కొనసాగుతోంది. బాలికల అవసరాలకు అనుగుణంగా భవనం లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరుకు గదులు, ప్రత్యేక డైనింగ్ హాల్ లేకపోవడం, సరిపడా బాత్రూములు, మరుగుదొడ్లు లేకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నామని విద్యార్థినులు వాపోతున్నారు.
తక్షణ చర్యలు తీసుకోవాలి
శిథిల భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టడంతో పాటు పోస్టుమెట్రిక్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, చదువుకు అనువైన వాతావరణం కల్పించేలా ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
