విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్ల పంపిణీ
ఊట్కూర్, ఆంధ్రప్రభ: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తానని మొగ్దుంపూర్ గ్రామ సర్పంచ్ తిరుమలేష్ అన్నారు.
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్దుంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు బూట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన నిర్వహించడంతో పాటు ఉచిత దుస్తులు, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, ఇతర విద్యా సామగ్రి సహా 16 రకాల వస్తువులను విద్యార్థులకు అందజేస్తోందని తెలిపారు.
పాఠశాల బలోపేతానికి తమ వంతు సహకారం అందిస్తానని, అక్షరాస్యతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు.
పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేసి, మండలంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శివరాజ్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, విద్యా కమిటీ చైర్మన్ సత్యమ్మ, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
