జ్యోతిష్య సేవలకు విశిష్ట గుర్తింపు

కొండపాక శ్రీనివాసాచార్యులకు ఉత్తమ జ్యోతిష్య అవార్డు

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ): పెద్దపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వేద పండితుడు, జ్యోతిష్య శాస్త్రవేత్త కొండపాక శ్రీనివాసాచార్యులు ఉత్తమ జ్యోతిష్య అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణ జ్యోతిష్య విజ్ఞాన సభ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన విశిష్ట గౌరవ పురస్కార ప్రదానోత్సవంలో ఆయనకు ఉత్తమ జ్యోతిష్య విశిష్ట సేవా పురస్కారంను వేణుగోపాల చారి చేతుల మీదుగా ప్రదానం చేశారు.

వేద, జ్యోతిష్య శాస్త్రాల అభివృద్ధికి విశేష కృషి చేయడంతో పాటు ప్రజలకు జ్యోతిష్య సేవలను అందిస్తున్నందుకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేసినట్లు సభ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కొండపాక శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ గౌరవాన్ని అందించిన తెలంగాణ జ్యోతిష్య విజ్ఞాన సభ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తనకు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ వేద, జ్యోతిష్య శాస్త్రాల ప్రచారం, సేవలో మరింత నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు.

శ్రీనివాసాచార్యులకు ఈ పురస్కారం లభించడంతో పెద్దపల్లి ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు, శిష్యులు, అభిమానులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.