తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

స్థిరమైన సహాయ వ్యవస్థలతో తల్లిపాలకు ప్రాధాన్యం:
జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి ఆర్.ఎఫ్. ఖాన్

క్యాతన్‌పల్లి, ఆగస్టు 6 (ఆంధ్రప్రభ): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి 7 వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి (డీడబ్ల్యూఓ) ఆర్.ఎఫ్. ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), ఆరోగ్య ఉపకేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తున్నారని తెలిపారు. అలాగే బాలింతలు, గర్భిణులకు శిశువుకు సరైన విధంగా తల్లిపాలు పట్టించే పద్ధతులపై ప్రత్యేక కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు చెప్పారు.

వైద్యులు మాట్లాడుతూ శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం అత్యంత ముఖ్యమని సూచించారు. తొలి ఆరు నెలల వరకు నీళ్లు కూడా ఇవ్వకుండా కేవలం తల్లిపాలే అందించాలని, అనంతరం రెండేళ్ల వయస్సు వరకు పౌష్టికాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు. ఇలా చేయడం వల్ల శిశువుల్లో పోషకాహార లోపం, శిశు మరణాలు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని వివరించారు.

అదేవిధంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లుల్లో రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుందని తెలిపారు. బాలింతలకు కుటుంబ సభ్యులు, సమాజం అండగా నిలిచి తల్లిపాల అందించడంలో సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సీడీపీఓ విష్ణుప్రియ, సూపర్‌వైజర్ సంధ్యారాణి, అంగన్‌వాడీ సిబ్బంది కనుక లక్ష్మి, విక్టోరియా, రాణి, గంగమణి, హేమలత, సునీత, కవిత, శారద, అనిత తదితరులు పాల్గొన్నారు.