ప్ర‌తి చెరువుకూ ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌!

ప్ర‌తి చెరువుకూ ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌!

ల‌క్ష్యాల‌కు అనుగుణంగా జ‌ల‌ధార ప‌నుల పూర్తికి కృషిచేయండి
ప‌నుల పురోగ‌తిపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ముఖ్యం
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రతి చెరువు పరిస్థితిని పరిశీలించి, అవసరానికి అనుగుణంగా పూడికతీత, బండల బలపరిచే పనులు, కాలువల శుభ్రపరిచే కార్యక్రమాలు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని.. జిల్లాలో చేప‌డుతున్న జ‌ల‌ధార ప‌నుల‌ను వేగ‌వంతం చేసి, నిర్దేశిత ల‌క్ష్యాల‌కు అనుగుణంగా స‌మ‌య‌పాల‌న‌తో పూర్తిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో డ్వామా, జ‌ల వ‌న‌రులు త‌దిత‌ర స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో జ‌ల‌ధార‌-జ‌ల‌హార‌తిపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

చెరువుల అభివృద్ధి ప‌నుల‌తో పాటు గొలుసు కట్టు చెరువుల ప‌నుల పురోగ‌తిని అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్ష‌ణ, భూగ‌ర్భ జ‌లాల పెంపు, రైతుల‌కు సాగునీటి అందుబాటు వంటి అంశాల‌ను దృష్టిలో ఉంచుకొని జ‌ల‌ధార కార్య‌క్ర‌మాన్ని ప్రాధాన్యంగా అమ‌లు చేయాల‌ని సూచించారు. జిల్లాలో మొత్తం 766 ప‌నులు మంజూరుకాగా 578 ప‌నులు ప్రారంభ‌మై పురోగ‌తిలో ఉన్నాయ‌ని.. వీటిని త్వ‌రిత‌గ‌తిన పూర్తిచేసి మిగిలిన ప‌నుల‌ను కూడా ప్రారంభించి ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌న్నారు. ప‌నుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా కార్యాచ‌ర‌ణ చేపట్టాల‌ని, ప్రతి దశలో జ‌ల వ‌న‌రుల శాఖ పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు తెలిపారు.

చెరువులు, కాలువలు, వాగులు, ఇంకుడు గుంతలు వంటి నీటి వనరుల అభివృద్ధి ద్వారా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.రాము త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply