Ishan Kishan | ఇది క‌దా కంబ్యాక్ అంటే..!!

  • అడిగితే రాలేదు… అర్హతతోనే సాధించాడుగా..!

భారత క్రికెట్ చరిత్రలో ఒక ఆటగాడి కెరీర్ గ్రాఫ్ ఎంత వేగంగా పతనాన్ని చూసిందో, అంతే వేగంగా తిరిగి శిఖరాగ్రానికి చేరుకోవడం బహుశా బీహార్‌‌ బాయ్ ఇషాన్ కిషన్ విషయంలోనే సాధ్యమైంది. గత 18 నెలలుగా భారత క్రీడారంగంలో అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం ఇషాన్ కిషన్ “రెడంప్షన్ ఆర్క్” (Redemption Arc).

ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో తిరుగులేని ఆటగాడిగా, టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌గా ఎదుగుతాడన్న స్థాయి నుంచి, క్రమశిక్షణారాహిత్యం వల్ల సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయి జట్టుకు దూరమైన స్థితికి చేరుకున్నాడు.

అలాంటి టఫ్ సిచ్చూవేష‌న్స్ నుంచి మళ్లీ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం వరకు కిషన్ సాగించిన ప్రయాణం అసాధారణం. ఇది కేవలం ఒక ఆటగాడి పునరాగమనం మాత్రమే కాదు.. అపజయాల నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి నిలబడిన ఒక యోధుడి గాథ.

స‌ఫారీల సిరీస్ నుంచి ప్రారంభ‌మైన‌ పతనం..

ఇషాన్ కిషన్ కెరీర్‌లో చీకటి రోజులు డిసెంబర్ 2023లో జరిగిన దక్షిణాఫ్రికా పర్యటనతో ప్రారంభమయ్యాయి. సుదీర్ఘ ప్రయాణాల వల్ల కలిగిన అలసట, మానసిక ఒత్తిడి కారణంగా ఇషాన్ కిషన్ విరామం కోరగా, బోర్డు అందుకు అనుమతించింది. అయితే, విరామ సమయంలో కిషన్ దుబాయ్‌లో పార్టీ చేసుకుంటున్న ఫోటోలు బయటకు రావడం బీసీసీఐ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది.

హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెక్రటరీ జై షా అప్పట్లో ఇషాన్ కిషన్‌ను దేశవాళీ క్రికెట్ ఆడాలని హెచ్చరించినప్పటికీ, కిషన్ ఆ ఆదేశాలను పక్కన పెట్టారు. దేశ‌వాళీ మ్యాచ్ లు, రంజీ ట్రోఫీ ఆడకుండా బరోడాలో హార్దిక్ పాండ్యాతో కలిసి వ్యక్తిగత శిక్షణ పొందడానికే ప్రాధాన్యత ఇచ్చారు.

బోర్డు ఆదేశాలను లెక్కచేయని కారణంగా ఆయనను ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక టెస్ట్ సిరీస్‌తో పాటు ఆ తర్వాత జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కూడా దూరం పెట్టి, కిషన్‌ను జట్టు ఎంపికలో ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు సెల‌క్ట‌ర్లు.

సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు…

ఫిబ్రవరి 2024లో కిషన్‌కు గట్టి గుణపాఠం నేర్పింది. క్రమశిక్షణ విషయంలో బీసీసీఐ ఎంత కఠినంగా ఉంటుందో తెలిసొచ్చింది. జాతీయ జట్టుకు ఆడాలనే పట్టుదల ఉంటే దేశవాళీ క్రికెట్‌ను విస్మరించకూడదనే స్పష్టమైన సందేశంతో ఇషాన్ కిషన్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను బోర్డు రద్దు చేసింది. గ్రేడ్-సి కాంట్రాక్ట్ నుండి తొలగించబడటంతో కిషన్ కెరీర్ ముగిసిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి.

క్రమశిక్షణ లేని ఆటగాడిగా ముద్రపడటంతో 2024 టీ20 ప్రపంచ కప్‌లో కూడా ఇషాన్ కిష‌న్ కు చోటు దక్కలేదు. సుమారు ఏడాదిన్నర కాలం పాటు నీలి రంగు జర్సీకి దూరమైన కిషన్, ఆ సమయంలో నిశ్శబ్దంగా తన తప్పులను సరిదిద్దుకుంటూ, మళ్ళీ జీరో నుండి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు.

దేశవాళీ సమరంలో విశ్వరూపం…

జట్టులోకి తిరిగి రావడానికి దేశవాళీ క్రికెట్ ఒక్కటే రాజమార్గమని గ్రహించిన కిషన్, 2024-25 సీజన్‌లో జార్ఖండ్ తరపున ఆడాలని నిశ్చయించుకున్నారు. ముఖ్యంగా 2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) లో కిషన్ చూపిన విశ్వరూపం సెలెక్టర్ల కళ్ళు తెరిపించింది.

Ishan Kishan

కెప్టెన్‌గా జార్ఖండ్ జట్టును ముందుండి నడిపిస్తూ 10 ఇన్నింగ్స్‌లలో 57.44 అద్భుత సగటుతో, 197.32 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 517 పరుగులు సాధించి టోర్నమెంట్‌లో అగ్రస్థానంలో నిలిచారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా తనదైన శైలిలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ, ఆధునిక క్రికెట్‌కు అవసరమైన దూకుడైన ఆటతీరు తనలో ఇంకా సజీవంగానే ఉందని ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ సీజన్ కిషన్‌లోని అసలైన ప్రతిభను, పట్టుదలను మరోసారి వెలుగులోకి తెచ్చి, విమర్శకుల నోళ్లు మూయించింది.

స్మాట్ గెలుపు.. ప్రపంచ కప్ పిలుపు !

పునరాగమనం అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా డిసెంబర్ 18, 2025న హర్యానాతో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌లో కిషన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 49 బంతుల్లోనే 101 పరుగులు సాధించి జార్ఖండ్‌కు మొట్టమొదటి టైటిల్‌ను అందించి చారిత్రక విజయాన్ని నమోదు చేశారు.

ఈ మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా, డిసెంబర్ 20, 2025న ప్రకటించిన 2026 టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టులో కిషన్‌కు చోటు ద‌క్కింది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న శుభ్‌మన్ గిల్ స్థానంలో, విధ్వంసకర లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్-వికెట్ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేయడంతో టీమిండియా వ్యూహాలకు కొత్త బలం చేకూరింది.

బరోడాలో ఒంటరిగా ప్రాక్టీస్ చేసిన స్థాయి నుండి, జాతీయ జట్టుకు మళ్లీ ఎంపిక కావడం వరకు సాగిన కిషన్ ప్రయాణం క్రికెట్ చరిత్రలో ఒక అద్భుత పునరాగమనంగా నిలిచిపోతుంది.

Leave a Reply