పైడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..

  • పోలీసుల లాఠీచార్జ్… గాల్లోకి కాల్పులు
  • పోలీసులపై రాళ్లు రువ్విన గ్రామస్తులు
  • ఫలితాలు తారుమారు చేశారంటూ ఆందోళన
  • బ్యాలెట్ బాక్స్‌ల తరలింపునకు అడ్డంకి
  • రీకౌంటింగ్‌కు డిమాండ్

వెల్గటూర్, ఆంధ్రప్రభ : మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు చేశారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపారు.

చివరి నిమిషంలో కొందరు కీలక వ్యక్తుల జోక్యంతో సర్పంచ్ ఎన్నిక ఫలితాన్ని మార్చారని ఆరోపిస్తూ ఓ అభ్యర్థికి మద్దతుగా గ్రామస్తులు, యువత పోలింగ్ సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణ క్రమంగా ఉగ్రరూపం దాల్చడంతో బ్యాలెట్ బాక్స్‌లను బయటకు తరలించకుండా పోలింగ్ కేంద్రం ఎదుట వందలాది మంది గ్రామస్తులు బైఠాయించి నిరసన చేపట్టారు.

పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్తులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలింగ్ కేంద్రం ముందు ఆందోళన కొనసాగించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపి గుంపును చెదరగొట్టారు.

దీనికి ప్రతిగా గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడినట్లు సమాచారం. అనంతరం పోలీసులు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని, బ్యాలెట్ బాక్స్‌లను పోలింగ్ కేంద్రం నుంచి తరలించారు.

ప్రస్తుతం పైడిపల్లి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి భారీగా పోలీసు బలగాలను గ్రామంలో మోహరించారు.

Leave a Reply