వ్యవసాయంలో పెరగనున్న టెక్నాలజీ వినియోగం

- సమయంతో పాటు డబ్బు ఆదా
- ఆసక్తి చూపుతున్న రైతన్నలు
పల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ : వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మరింత సమర్థంగా.. సులభంగా రసాయనాలు పిచికారీ చేయడానికి డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి అన్ని పంటలకు పిచికారీ చేయడానికి అనుకూలంగా ఉండటంతో పాటు వేగంగా పని పూర్తవుతుండటం, రసాయనం సమర్థంగా పని చేస్తుండటంతో కర్షకులు ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించి మంచి ఫలితాలు పొందారు. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో మూలన పడిన కిసాన్ డ్రోన్ల పథకం నిబంధనలు సడలించింది.
తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలకు పురుగు మందులు పిచికారీ చేయడానికి డ్రోన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటికోసం రైతులు ఆసక్తి చూపుతూ ముందుకొస్తున్నారు.
ఉపయోగాలు ఇవి
డ్రోన్ల ద్వారా పిచికారీ చాలా వేగంగా, సులభంగా పూర్తవుతుంది. ఎకరా విస్తీర్ణంలో పురుగుల మందు పిచికారీ చేయడానికి 8 నిమిషాల సమయం సరిపోతుందని, సాధారణ పిచికారీతో పోల్చితే పురుగుమందు కూడా 30 శాతం వరకు ఆదా అవుతుందని డ్రోన్ల సాంకేతికను అందుపుచ్చుకున్న రైతులు చెబుతున్నారు. అదే రైతు భుజానికి ట్యాంకు తగిలించుకుని స్ప్రే చేసేందుకు దాదాపుగా రెండు గంటలకు పైగా పడుతుందన్నారు.
నేలలో తేమ ఎక్కువగా ఉన్నా.. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా డ్రోన్లతో పిచికారీకి ఇబ్బందులు ఉండవు. సాధారణ స్ప్రేయర్లతో చల్లే క్రమంలో అన్ని మొక్కలకు సక్రమంగా పడక పోవడం, గాలికి కొంత నేల మీద పడి వృథా కావడం వంటి లోపాలు ఉంటాయి. డ్రోన్ల ద్వారా పై నుంచి రసాయనాలను పంటలపై చల్లడం వల్ల మొక్కలపై పడటంతో వృథా కాకుండా ఉంటుంది.
పంటపై నుంచి ఎంత ఎత్తులో కావాలంటే అంత ఎత్తులో పిచికారీ చేసే వెసులుబాటు ఉంటుంది. పలువురు ప్రైవేటు డ్రోను అపరేటర్లు ఇప్పటికే ఎకరాకు కొంత మొత్తం వసూలు చేస్తూ రైతులకు సేవలు అందిస్తున్నారు.
అధిక వర్షాలు పడి పొలంలోకి మనిషి వెళ్లలేని పరిస్థితి ఉన్నా గట్టుపై నుంచి డ్రోన్ ద్వారా పిచికారీ చేసుకునే వెసులుబాటు ఉంది. మనుషులు చల్లితే వృథా ఎక్కువగా ఉంటుంది. డ్రోన్‌తో మందు పిచికారీ చేస్తే ఎకరాకు రూ.350 ఖర్చు అవుతుంది. డ్రోన్‌తో రోజుకు 10 ఎకరాల్లో మందు పిచికారీ చేస్తుంది.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉన్నందున ఇటీవల కాలంలో దీనిపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వం రైతు బృందాలకు రాయితీపై డ్రోన్లను ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇవి కస్టమ్ హైరింగ్ సెంటర్(సీహెచ్‌సీ) బృందాలకు 40 శాతం రాయితీపై అందిస్తారు. డ్రోన్ల సగటు ధర రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ప్రతి మండలానికి మూడు ఆర్బీకేల పరిధిలో ఎంపిక చేసిన రైతు బృందాలకు డ్రోన్లను రాయితీపై ఇస్తారు.
ఇందుకు సంబంధించి ఎంపిక చేసిన బృందాల్లో ఒకరిని శిక్షణకు పంపుతున్నారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం డ్రోన్ ఆపరేట్ చేసే వ్యక్తికి కచ్చితంగా పాస్‌పోర్టు ఉండాలి. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హతలను నిర్ణయించింది.
డ్రోన్ కొనుగోలుకు అయ్యే వ్యయాన్ని బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాలి. రైతు వాటాతో మొత్తం సొమ్ము చెల్లించిన తర్వాత డ్రోన్ కొనుగోలు చేస్తారు. అనంతరం ప్రభుత్వం ఆందించే రాయితీని బృందఖాతాకు జమచేస్తారు.
శిక్షణ పొందిన రైతు బృందంలో మిగిలిన రైతులతో ఒప్పందం చేసుకుంటారు. శిక్షణ పొందిన తర్వాత అదే బృందంలో కొనసాగేలా ఒప్పందం ఉంటుంది. డ్రోన్ గ్రామంలోని అందరి రైతుల అవసరాలకు ఉపయోగపడేలా నిబంధనలు ఉంటాయి. అందరికీ అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది.
జిల్లాలో 61 డ్రోన్ల పంపిణీ
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావును ఈ విషయంపై వివరాలు అడగగా ఇప్పటి వరకు జిల్లాలో 61 డ్రోన్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. 43 డ్రోన్లను పంపిణీ చేయాల్సిఒదిగా ప్రభుత్వలక్ష్యంగా కాగా, 61 డ్రోన్లను ఈ ఆర్థిక సంవత్సరానికి రైతులు అందజేయడం జరిగిందని వివరించారు. ఒక్కొక్క డ్రోన్ విలువ 9,80,000 కాగా సబ్సిడీ 7,80,000 ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.
