క్యాన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలి

- డాక్టర్ తేజస్విని
రేణిగుంట, ఆంధ్రప్రభ : క్యాన్సర్‌పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి, సరైన అవగాహన కలిగి ఉండాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ తేజస్విని సూచించారు. శుక్రవారం తిరుపతి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఆదేశాల మేరకు రేణిగుంటలో డాక్టర్ తేజస్విని ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్త్రీ, పురుషులలో అసంక్రమణ వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్ వంటి వ్యాధులపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 18 సంవత్సరాల పైబడిన వారిలో ఇంటింటా పరీక్షలు నిర్వహించి… ఈ వ్యాధులను తొలిదశలో గుర్తించి, తగిన చికిత్స, నివారణ చర్యలు చేపడితే మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు.
చికిత్సకంటే.. నివారణే ఉత్తమం అని గుర్తుచేసిన ఆమె, క్యాన్సర్ నివారణకు పొగాకు అలవాటును పూర్తిగా మానుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, నడక, యోగా, ధ్యానం వంటి అలవాట్లతో ఆరోగ్యంగా జీవించవచ్చని సూచించారు. ఈ విషయాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డిపిఎమ్వో మునిసుబ్బరామిరెడ్డి, సిహెచ్‌వో అన్నపూర్ణ, హెల్త్ సూపర్వైజర్లు నాగరాజు, శివశంకర్, అనురాధ, కామరాజు, ఎఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
