ఎస్ హెచ్ జీ సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరలు

ఎస్ హెచ్ జీ సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరలు

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిద్ధమవుతున్న 64 లక్షల చీరలు

రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలోని అన్ని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు ఇందిరా మహిళా శక్తి చీరలు సిద్ధవుతున్నాయని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Garima Agrawal) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల పంపిణీ చేసే ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియ, ఇతర అంశాలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు జిల్లాకు రాగా, వారితో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం ఇంచార్జి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు.

ఇందిరా మహిళా శక్తి కింద మహిళలకు చీరలు అందజేయడంతో ఇటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. వస్త్ర పరిశ్రమకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. కార్మికులు ఎంతో నైపుణ్యంతో చీరలు నేస్తారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళ శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేశామని తెలిపారు.

మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందితే తమ కుటుంబంతోపాటు సమాజ అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పథకంలో మహిళలను భాగస్వామ్యులను చేస్తుందని వెల్లడించారు. ప్రతి ఎస్ హెచ్ జీ మహిళా రుణాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి, మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Leave a Reply