కర్మే విత్తనం… ఫలితమే జీవితం!

కర్మబంధ విముక్తికి సాధనే మార్గం: సీనియర్ మాస్టర్ సురేష్‌బాబు

పుత్తూరు, ఆంధ్రప్రభ : మనిషి చేసే కర్మలకు అనుగుణంగానే జీవితంలో ఫలితాలు ఉంటాయని నెల్లూరుకు చెందిన సీనియర్ మాస్టర్ సురేష్‌బాబు అన్నారు. పుత్తూరులోని త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయంలో ఆదివారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన కర్మబంధ విముక్తిపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్మల నుంచి విముక్తి పొందడమే సాధన ప్రధాన లక్ష్యమని చెప్పారు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు అనుభవించక తప్పదని వివరించారు. “చేసిన పుణ్యాలు భోగాలుగా… చేసిన పాపాలు రోగాలుగా అనుభవంలోకి వస్తాయి” అని పేర్కొన్నారు.

మనిషి ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలనే పొందుతాడని, ఆధ్యాత్మిక సాధన ద్వారా కర్మబంధాల నుంచి విముక్తి పొందేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని సూచించారు.

అనంతరం త్రినేత్ర పిరమిడ్ దివ్య ధ్యాన దేవాలయ నిర్వాహకులు సురేష్‌బాబును శాలువాతో ఘనంగా సత్కరించారు.