ఉగ్ర మాడ్యూల్‌లో బోధ‌న్ వాసి

దేశంలో ఐదుగురు ఉగ్ర‌వాదులు అరెస్టు

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రెండు రోజుల‌పాటు ఢి్ల్లీ స్పెష‌ల్ సెల్ (Delhi Special Cell) దాడులు నిర్వ‌హించి ఐదుగురు ఉగ్రవాదుల (Five terrorists)ను ప‌ట్టుకున్న‌ట్లు అదనపు సీపీ ప్రమోద్ సింగ్ కుష్వాహా (Additional CP Pramod Singh Kushwaha) తెలిపారు. అందులో నిజామాబాద్ వాసి కూడా ఒకరు ఉన్నార‌న్నారు. ఈ రోజు పాకిస్తాన్ హ్యాండ్లర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మాడ్యూల్‌లో ఐదుగురి అరెస్ట్ అయ్యారు. వారిలో ఒకరు జార్ఖండ్‌, ఇద్దరు ఢిల్లీ నుంచి (వీరు అసలు ముంబై నివాసితులు), మరొకరు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన బోదన్ పట్టణానికి చెందిన ఒకరు, మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన మరొకరు ఉన్నారు. నిందితుల వద్ద నుంచి గన్‌పౌడర్ తయారీలో ఉపయోగించే సల్ఫర్ పౌడర్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సోడియం బైకార్బోనేట్, పీహెచ్ చెకర్, బాల్ బెరింగ్స్, ఐఈడీ తయారీకి ఉపయోగించే పరికరాలు, వైర్లు, మదర్‌బోర్డులు, లాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్లు, అలాగే ఆయుధాలు, బుల్లెట్లను స్పెషల్ సెల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  • పాకిస్తాన్ హ్యాండ్లర్ వీరికి ఇచ్చిన టాస్క్ “ఖిలాఫత్ మోడల్” ప్రకారం ఒక స్థలం ఏర్పరచుకుని, పెద్ద టీమ్‌ని తయారు చేసి దాడులు చేయడమని ప్రమోద్ సింగ్ చెప్పారు. నిందితుల గురించి వివ‌రించారు.
  • అరెస్టయిన వారిలో కీలక నిందితుడు జార్ఖండ్‌కి చెందిన దానిష్ గా గుర్తించామని, అతడే పాకిస్తాన్ హ్యాండ్లర్‌తో నేరుగా టచ్‌లో ఉండి మొత్తం గ్రూప్‌ని కనెక్ట్ చేశాడు. అలాగే అతను “Ghazwa Leader” ఐడీని ఉపయోగించుకుంటూ తన కోడ్ నేమ్‌ను CEOగా పెట్టుకున్నాడు.
  • మరో నిందితుడు ఆఫ్తాబ్ అంసారీ ముంబై సమీపంలోని థానే జిల్లాకు చెందినవాడు. ఇతడి బాధ్యత టార్గెట్ కిల్లింగ్ కోసం ఆయుధాలను సేకరించడం. అతను ఢిల్లీ నుంచి ఆయుధాలు తీసుకుని తిరిగి వెళ్తుండగా తన సహచరుడు సుఫియాన్ అబూబకర్‌ (Sufyan Abubakar)తో కలిసి పట్టుబడ్డాడు.
  • మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్‌లో కమ్రాన్ ఖురేషీ, తెలంగాణ నిజామాబాద్‌లో హుజైఫా అరెస్టయ్యారు.
  • అందరూ 20 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులేనని, వీరికి ఆయుధాలు, పేలుడు పదార్థాలు తయారు చేసుకోవడమని సూచనలు ఇచ్చిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా కొన్ని ఇంక్రిమినేటింగ్ డ్రాయింగ్‌లు కూడా ఉగ్రవాదుల వద్ద లభించాయి. అలాగే ఈ ఆపరేషన్‌తో పాకిస్తాన్ హ్యాండ్లర్ మద్దతుతో నడుస్తున్న ఒక పెద్ద ఉగ్ర మాడ్యూల్‌ను పోలీసులు అడ్డుకున్నారని ఢిల్లీ అదనపు సీపీ ప్రమోద్ సింగ్ కుష్వాహా తెలిపారు.