IND vs ENG 4th Test | ఇంగ్లండ్ దూకుడు… కష్టాల్లో భారత్!
మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆటలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 225 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఇంకా 133 పరుగులు వెనుకబడినా, 8 వికెట్లు మిగిలి ఉండటంతో.. ఈ మ్యాచ్ గెలవడం భారత్ కు గట్టి సవాల్ గా మారింది.
బెన్ డకెట్ – జాక్ క్రాలీ జోడీ తొలి వికెట్‌కి 166 పరుగుల భాగస్వామ్యంతో భారత్ బౌలింగ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. ఓల్డ్ ట్రాఫర్డ్‌లో ఇది ఇంగ్లండ్‌కు మూడో అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం. అయితే జడేజా 32వ ఓవర్లో క్రాలీ (84)ను పెవిలియన్‌కి పంపి ఆ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. వెంటనే కాంబోజ్ తన తొలి టెస్టులోనే డకెట్ (94)ను అవుట్ చేసి విలువైన వికెట్ సాధించాడు. ప్రస్తుతం రూట్ (11) – ఓలి పోప్ (20) క్రీజులో నిలిచారు.
భారత్ ఇన్నింగ్స్‌లో…
భారత ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుత బౌలింగ్‌తో ఐదు వికెట్లు పడగొట్టి భారత్‌ను కట్టడి చేశాడు. జోఫ్రా ఆర్చర్ మూడు కీలక వికెట్లు తీసి మిగిలిన బౌలర్లకు తోడుగా నిలిచాడు.
భారత ఇన్నింగ్స్‌లో ప్రధాన ఆకర్షణ రిషబ్ పంత్ నిలిచాడు. కాలు ఫ్రాక్చర్‌తో బాధపడుతూ కూడా 314/6 వద్ద క్రీజులోకి వచ్చి అర్ధశతకం పూర్తి చేసి స్కోరును 358 పరుగుల వరకు తీసుకెళ్లాడు.
రెండో రోజు ఆట ముగిసే సరికి మ్యాచ్‌లో పైచేయి ఇంగ్లండ్‌కే అని చెప్పుకోవచ్చు. కానీ, రేపు డే 3 భారత్ ఎదురుదాడి చేయగలిగితే మ్యాచ్ ములుపు తిరిగే అవకాశం ఉంది.
