Sachin Tendulkar | బ్రాడ్ ఆల్‌టైమ్ టెస్ట్ జట్టు ప్ర‌క‌ట‌న‌

Sachin Tendulkar | బ్రాడ్ ఆల్‌టైమ్ టెస్ట్ జట్టు ప్ర‌క‌ట‌న‌

బుమ్రాను కూడా పక్కనపెట్టిన ఇంగ్లండ్ మాజీ పేసర్
భారత్ నుంచి విరాట్ కోహ్లీకే స్థానం..
ఎంపికపై క్రికెట్ వర్గాల్లో చర్చ

Sachin Tendulkar | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఇంగ్లండ్ మాజీ దిగ్గజ పేసర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ (Stuart Broad) ప్రకటించిన ఆల్‌టైమ్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న అత్యుత్తమ ఆటగాళ్లతో రూపొందించిన ఈ జట్టులో భారత క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండుల్క‌ర్ (Sachin Tendulkar)కు చోటు దక్కకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ పేసర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన జ‌స్ర్సిత్ బుమ్రా (Jasprit Bumrah) కూడా ఈ జట్టులో స్థానం పొందలేదు.

సచిన్‌పై పాంటింగ్‌కు ప్రాధాన్యం
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ (Ricky Ponting) ఇద్దరూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయాల్సి వస్తే తాను పాంటింగ్ వైపే మొగ్గు చూపుతానని బ్రాడ్ పేర్కొన్నాడు. దీంతో తన జట్టులో మూడో స్థానంలో పాంటింగ్‌కు అవకాశం కల్పించాడు.

భారత్ నుంచి కోహ్లీ ఒక్కరే

బ్రాడ్ ఎంపిక చేసిన జట్టులో భారత ఆటగాళ్లలో కేవలం విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రమే చోటు దక్కించుకున్నారు. నాలుగో స్థానంలో కోహ్లీని ఎంపిక చేసిన బ్రాడ్, ఆధునిక యుగంలో అతని నిలకడైన ప్రదర్శనను గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే సచిన్, బుమ్రా వంటి దిగ్గజాలు లేకపోవడం భారత అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

స్టువర్ట్ బ్రాడ్ ఆల్-టైమ్ టెస్ట్ XI వివరాలు:ఓపెనర్లు: గ్రీమ్ స్మిత (సౌతాఫ్రికా), కుమార్ సంగక్కర (శ్రీలంక – వికెట్ కీపర్)మిడిల్ ఆర్డర్: రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ (భారత్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), జాక్వెస్ కలిస్ (సౌతాఫ్రికా)ఆల్‌రౌండర్: ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా)బౌలర్లు: మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా), డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా), ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)

బుమ్రాను ఎందుకు ఎంపిక చేయలేదు?
బ్రాడ్ కెరీర్‌లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో ఉన్న అనుబంధం ప్రత్యేకంగా గుర్తించదగ్గది. 2022లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా బ్యాటింగ్ చేస్తూ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్‌లో 35 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయినప్పటికీ బ్రాడ్ తన జట్టులో బుమ్రాకు అవకాశం ఇవ్వకుండా మిచెల్ జాన్సన్, డేల్ స్టెయిన్, మిచెల్ స్టార్క్ వంటి పేసర్లను ఎంపిక చేశాడు.

అభిమానుల్లో చర్చ!
సచిన్ టెండూల్కర్‌కు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఉండగా, బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్ట్ బౌలర్లలో ఒకరిగా గుర్తింపు పొందుతున్నాడు. అలాంటి ఇద్దరు భారత దిగ్గజాలు బ్రాడ్ జట్టులో లేకపోవడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే ఇది పూర్తిగా బ్రాడ్ వ్యక్తిగత ఎంపిక మాత్రమేనని, తన కెరీర్‌లో ఎదుర్కొన్న ఆటగాళ్ల ఆధారంగా ఈ జట్టును రూపొందించినట్లు క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.