Pawan Klayan | బాయ్‌కాట్ అంటే ఏం చేస్తారు.. చేసుకోండి!
- హరిహర వీరమల్లు సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తన సినీ జీవితంలో మొదటిసారిగా సక్సెస్ మీట్‌లో పాల్గొంటున్నట్టు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు. ‘‘హరిహర వీరమల్లు’’ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో గురువారం జరిగిన సక్సెస్ మీట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పవన్ మాట్లాడుతూ — ‘‘ఇది నా జీవితంలో వడ్డించిన విస్తరి కాదు. ఏది తేలికగా జరగలేదు. మంత్రి పదవి ఉంది కదా సినిమా సులువుగా రిలీజ్ అవుతుందనుకున్నా. కానీ వారం రోజులు నిద్రలేకుండా వెచ్చించా. గడచిన రెండు రోజుల్లో మాట్లాడినది, నా 29 ఏళ్ల సినీ జీవితం మొత్తం కలిపినా పది శాతం కూడా కాదు!’’ అన్నారు.
ప్రైవేట్ నిర్మాతలు, ఫైనాన్షియర్‌లకు కృతజ్ఞతలు చెబుతూ — ‘‘మైత్రి మూవీస్, పీపుల్ మీడియా అందించిన అండ వల్లే ఇది సాధ్యమైంద’’ అని కొనియాడారు.
మొఘల్ చరిత్రను తిప్పి చూడాల్సిన అవసరం ఉందని, మన చరిత్రలో మన రాజులకు సరైన గుర్తింపు దక్కలేదని పవన్ వ్యాఖ్యానించారు. ‘‘ఔరంగజేబ్ గురించి గొప్పగా చెప్పారు… కానీ అతడి దుర్మార్గాన్ని దాచిపెట్టారు. మన చరిత్రను చిన్నచూపు చూశారు. కృష్ణదేవరాయ, రుద్రమదేవి లాంటి గొప్ప వీరుల గురించి ఎందుకు పెద్దగా చెప్పలేదు?’’ అని ప్రశ్నించారు.
‘‘బాయ్‌కాట్ చేస్తామంటారా? దానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చేసుకోండి!’’ అంటూ కొందరి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘‘నెల్లూరు వీధుల్లో పెరిగిన వాడిని. ఇంత స్థాయికి రావడం చిన్న విషయం కాదు. ఎవరో ఒక హీరో సినిమా తీస్తే అది మిమ్మల్ని భయపెట్టే స్థాయిలో ఉందా? బాయ్ కాట్ అంటే ఏం చేస్తారు. చేసుకోండి. ఏం ఫరక్ పడుతుంది. అన్ని చూడకుండా ఇంత దూరం వచ్చామా. ఇలాంటి తాటాకు చప్పుళ్లకి బెదరం. నేను ఈ రోజు ఇంత బలంగా ఉన్నానంటే అభిమానులు ఇచ్చిన బలం. నాకు ఒక్కటే తెలుసు బలంగా ఉండడమే తెలుసు.
‘‘సినిమాకు కలెక్షన్లు రావడం కన్నా చరిత్రలో దాగి ఉన్న నిజాన్ని చెప్పగలిగినందుకే నాకు ఎక్కువ ఆనందం. రెండో భాగానికి సగం పూర్తయింది. సాంకేతికంగా కొన్ని సూచనలు వచ్చాయి. అవి తీసుకుంటాం. అభిమానులు చిన్న చిన్న కామెంట్స్‌కి కూలిపోకండి. నేను కదా దెబ్బలు తింటోంది. మీరు జీవితాన్ని ఎంజాయ్ చేయండి. సోషల్ మీడియా కామెంట్స్‌కి నలిగిపోకండి. దమ్ముంటే తిరిగి కొట్టండి అని పవన్ కల్యాణ్ సూచించారు.
సక్సెస్ మీట్‌లో నిర్మాత ఎఎం. రత్నం, నటి నిధి అగర్వాల్, దర్శకుడు జ్యోతి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘‘హరిహర వీరమల్లు’’ క్లైమాక్స్ అందరికీ నచ్చిందని, భాగం–2లో మరింత ప్యాన్ ఇండియా స్థాయిలో చూపిస్తామని చెప్పడమే ప్రత్యేకత.
