ఏలేరు ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం

  • అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశాలు
  • పురుషోత్తమపట్నం స్టేజ్-2 పంపింగ్ స్టేషన్‌, ఏలేరు కాలువల పరిశీలన

కాకినాడ, ఆంధ్రప్రభ: కాకినాడ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం ఏలేరు రిజర్వాయర్ పరిధిలోని నీటిపారుదల వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఏలేరు రిజర్వాయర్ కాలువలు, రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేస్తున్న పురుషోత్తమపట్నం స్టేజ్-2 పంపింగ్ స్టేషన్‌ను సందర్శించి పనితీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా ఏలేరు రిజర్వాయర్‌కు నీటి లభ్యత పెరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే ఏలేరు రిజర్వాయర్‌తో పాటు పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి కూడా ఏలేరు ఆయకట్టుకు సాగునీరు అందేలా సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పంపింగ్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలని, రైతులకు సకాలంలో సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు స్పష్టం చేశారు. కాలువల నిర్వహణ, నీటి పంపిణీ, మౌలిక సదుపాయాలపై కూడా అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, సత్యప్రభ, కాకినాడ జిల్లా టీడీపీ ఇన్‌చార్జి జ్యోతుల నవీన్, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, చీఫ్ ఇంజినీర్ చిన్నబాబు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.