Raj Bhavan |గవర్నర్ బంగ్లాకే కన్నం – హార్డ్ డిస్క్ లు మాయం

హైదరాబాద్: రాష్ట్రంలో మరో సంచలనం చోటుచేసుకున్నది. ఇప్పటివరకు సాధారణ పౌరులు, అధికారులు, రాష్ట్ర మంత్రుల ఇండ్లలోనే చోరీలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరుడి నివాసం, అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ, సీసీ కెమెరాలతో నిఘా ఉండే రాజ్‌భవన్‌లో దొంగతనం జరిగింది. గవర్నర్ అధికార నివాసంలోకి దర్జాగా వెళ్లిన ఓ వ్యక్తి.. మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ రూమ్‌లోకి చొరబడి నాలుగు హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లాడు.
ఈ నెల 13న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాజ్‌భవన్‌లోని సుధర్మ భవన్‌లో కొన్ని కంప్యూటర్ల నుంచి నాలుగు హార్డ్ డిస్కులు కనిపించకుండా పోయిన విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీనిపై వారు వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్ వంటి అత్యంత భద్రత ఉండే ప్రదేశంలో ఈ తరహా ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఫిర్యాదు అందుకున్న పంజాగుట్ట పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలో భాగంగా ఈ చోరీకి పాల్పడింది రాజ్‌భవన్‌లోనే కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అని పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. అనంతరం శ్రీనివాస్‌ను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ హార్డ్ డిస్కులలో ఏ విధమైన సమాచారం ఉందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. చోరీకి గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
