తహసీల్దార్ కార్యాలయానికి అనువైన స్థలం గుర్తించాలి

ఊట్కూర్‌లో నూతన భవన నిర్మాణంపై అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశాలు

ఊట్కూర్ మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి అనువైన స్థలాన్ని తక్షణమే గుర్తించాలని నారాయణపేట జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

బుధవారం మండల కేంద్ర శివారులో ప్రతిపాదిత భవన నిర్మాణ స్థలాలను పరిశీలించిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు, అధికారులకు సులభంగా చేరుకునే విధంగా కనీసం ఎకరం విస్తీర్ణంలో స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు.

ఊట్కూర్–అమీన్‌పూర్ రహదారి మార్గంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్–314లో రెవెన్యూ అధికారులు గుర్తించిన స్థలం తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి అనుకూలంగా లేదని పేర్కొన్నారు. దీంతో ప్రత్యామ్నాయ స్థలాలను వెంటనే పరిశీలించి అదే రోజు సాయంత్రంలోపు పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ అశోక్ కుమార్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు ఊట్కూర్ పరిధిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్–3, వక్ఫ్ భూమి సర్వే నంబర్–689, అసైన్ భూమి సర్వే నంబర్–764 ప్రాంతాలను పరిశీలించారు. ఆయా స్థలాల అనుకూలతపై నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు.

ఉన్నతాధికారులు తుది నిర్ణయం తీసుకున్న అనంతరం అనువైన ప్రదేశంలో ఆధునిక సౌకర్యాలతో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శంకర్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ చింత రవి, ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్, ఉపసర్పంచ్ రమేష్, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్రరెడ్డి, మండల సర్వేయర్ జయశంకర్, ఆర్‌ఐ కృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.