బడులు తెరుచుకున్న రోజే విద్యార్థుల చేతికి పుస్తకాలు
బడులు తెరుచుకున్న రోజే విద్యార్థుల చేతికి పుస్తకాలు
54,666 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు
నోటుబుక్స్ పంపిణీకి ఏర్పాట్లు
772 పాఠశాలలకు సరఫరా పూర్తి
జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్
నాగర్‌కర్నూల్, జూన్ 8 (ఆంధ్రప్రభ):
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ అందించాలనే లక్ష్యంతో జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని అన్ని మండలాల పాఠశాలలకు పుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీ పూర్తయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ తెలిపారు.
ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో గత కొన్నేళ్లుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్‌ను విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అందజేస్తోంది. ఈ ఏడాది కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ పంపిణీ ప్రక్రియను ముందుగానే పూర్తి చేశారు.
జిల్లాలో మొత్తం 772 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 54,666 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలో 495 ప్రాథమిక పాఠశాలలు, 125 అప్పర్ ప్రైమరీ పాఠశాలలు, 130 హైస్కూల్లు, 22 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అలాగే కేజీబీవీలు, గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, జ్యోతిరావు ఫూలే విద్యాసంస్థలు కూడా ఉన్నాయి.
జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు 3,86,070 పాఠ్యపుస్తకాలు మరియు 3,91,855 నోటుబుక్స్ అవసరమవుతాయని అంచనా వేశారు. రాష్ట్ర విద్యాశాఖ నుంచి అందిన పుస్తకాలు, నోటుబుక్స్‌ను ఇప్పటికే మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేశారు.
నోటుబుక్స్‌ను మండల విద్యాశాఖ కార్యాలయాల ద్వారా పంపిణీ చేయగా, పాఠ్యపుస్తకాలను నేరుగా పాఠశాలలకు అందజేసినట్లు డీఈఓ తెలిపారు. అయితే 5వ తరగతి తెలుగు పుస్తకాలు, 9వ తరగతి హిందీ పుస్తకాలు ఇంకా అందాల్సి ఉందన్నారు.
అదనంగా 84 వేల వర్క్‌బుక్స్ కూడా విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వాటి సరఫరా ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.
గతంలో మాదిరిగా ఆలస్యం కాకుండా ఈసారి పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికే ప్రతి విద్యార్థి చేతిలో పుస్తకాలు, నోటుబుక్స్ ఉండేలా చర్యలు తీసుకున్నామని రమేష్ కుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు, వసతి, పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ తదితర సౌకర్యాలను కల్పిస్తూ విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు.
