మన బడి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
ఏ దశలోనూ జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: మన బడి–మన భవిష్యత్తు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల కల్పన, మేజర్, మైనర్ మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో విద్యాశాఖ, సమగ్ర శిక్ష, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) తదితర శాఖల అధికారులతో మన బడి–మన భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించిన పనులు పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన బడి–మన భవిష్యత్తు పనుల్లో ప్రతి దశలోనూ వేగంగా చర్యలు తీసుకుంటేనే జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉంటుందని తెలిపారు. ఏ దశలోనూ జాప్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రివాల్వింగ్ ఫండ్‌ను పూర్తిస్థాయిలో వినియోగించి, ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు, మేజర్, మైనర్ మరమ్మతుల వంటి అత్యవసర పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
పూర్తయిన పనులను సంబంధిత ఆన్లైన్ పోర్టల్‌లో వెంటనే క్లోజర్ చేయాలని, ఫోటోలు అప్లోడ్ చేసి స్టేజ్ కన్వర్షన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. భౌతికంగా పూర్తయిన పనులు ఆన్లైన్లో కూడా ప్రతిబింబించేలా ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
ఒక పాఠశాలలో నిధులు మిగిలితే అవసరాన్ని బట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆబ్జెక్ట్ (టి.ఓ.) ద్వారా ఇతర పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న అత్యవసర పనులు పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నిధులను పూర్తిగా వినియోగించి పనులు ముగించేలా అధికారులు కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
ప్రస్తుతం పాఠశాలలు నడుస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని, అవసరమైన చోట దశలవారీగా మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించారు.
పేరెంట్స్ కమిటీలతో సమన్వయం కొనసాగిస్తూ పనుల్లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా మండల విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా చర్చించి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.
సమావేశంలో డీఈవో యు వి సుబ్బారావు, సమగ్ర శిక్ష ఏపీసి ఆర్ కుముదిని సింగ్, పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ రమణరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సోమశేఖర్, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
