ప్రమాద బాధిత గౌడ కార్మికులకు పరామర్శ

ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తా: గోపాగోని సారయ్య గౌడ్

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : తాటి చెట్లపై నుంచి పడి ప్రమాదాలకు గురైన గౌడ కార్మికులను కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపాగోని సారయ్య గౌడ్ మంగళవారం పరామర్శించారు.

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దపల్లి మండలం భోజన్నపేటకు చెందిన బాలసాని సమ్మయ్య గౌడ్‌తో పాటు, ఇటీవల తాటి చెట్టుపై నుంచి కిందపడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న జూలపల్లి మండలం కాచాపూర్‌కు చెందిన పాలకుర్తి రాములు గౌడ్‌ను ఆయన కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా సారయ్య గౌడ్ మాట్లాడుతూ గీత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గౌడ కార్మికులు ప్రమాదాలకు గురైనప్పుడు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు సహకారంతో బాధితులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం, న్యాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గౌడ సంఘాల నాయకులు పడాల కొమురయ్య గౌడ్, బాలసాని వెంకటేశం గౌడ్, కాచాపూర్ గౌడ సంఘం అధ్యక్షుడు రాజేశం గౌడ్, అంజయ్య గౌడ్, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.