నోరు అదుపులో పెట్టుకో.. కేటీఆర్..

నోరు అదుపులో పెట్టుకో.. కేటీఆర్..

  • దొంగలతో సీఎంకు లింకు పెడతావా..?
  • తీరు మార్చుకోకుంటే బుద్ధి చెప్పక తప్పదు..
  • పదేళ్ల దోపిడీ, దొంగతనాలు, హత్యలకు ఎవరిది బాధ్యత..?
  • ‘బండి’కి దమ్ముంటే సీబీఐ ద్వారా నోటీసులు ఇప్పించాలి..
  • రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • పీఎంజే జువెల్లరీ బాధితులకు పరామర్శ

కరీంనగర్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, ఇకనైనా తీరు మార్చుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. కరీంనగర్లో పీఎంజే జ్యువెల్లరీ దుకాణంలో ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలోగాయపడ్డ బాధితులను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంత్రి అడ్లూరి మంగళవారం పరామర్శించారు.

అనంతరం కరీంనగర్లోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ జువెల్లరీ షాప్లో జరిగిన దొంగతనం, కాల్పుల ఘటన దురదృష్టకరమన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని మంత్రి వివరించారు.

కరీంనగర్ దొంగతనం కేసులో నిందితులను పట్టుకోవడానికి 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నేరస్తులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామన్నారు. బాధితుల పరామర్శ పేరుతో కరీంనగ‌ర్‌కు వచ్చిన కేటీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. అంతర్రాష్ట్ర దొంగలను రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రితో పరిచయం ఉందని కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 నుండి 2023 వరకు అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో జరిగిన దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహిస్తాడా అని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.

అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ అక్రమంగా సంపాదించుకొని జన్వాడాలో ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు చూపించాలని నాటి పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా ద్వారా ఫామ్ హౌస్ చిత్రీకరణ చేస్తే నాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించి చంచల్ గూడ జైలుకి పంపించారని గుర్తు చేశారు. అక్రమ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపిన టీ ఆర్ఎస్ నాయకులు నేడు అంతర్రాష్ట్ర దొంగలకు ముఖ్యమంత్రికి సంబంధాలున్నాయని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

జువెల్లరీ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకులు రాలేదని కేటీఆర్ చేసిన ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదన్నారు. సంఘటన జరిగిన రోజు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితోపాటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, వెలిచాల రాజేందర్రావులు పరామర్శించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మంథనిలో జరిగిన జంట హత్యల ఘటనలో ఇద్దరు న్యాయవాదులు మరణిస్తే నాడు ఎందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని ప్రశ్నించారు.

చనిపోయిన వ్యక్తి మరణ వాంగ్మూలంలో సైతం బీఆర్ఎస్ నాయకులకు తమ హత్యకు సంబంధం ఉందని చెప్పినప్పటికీ నాడు కేటీఆర్ ఎందుకు పట్టించుకోలేదన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నేరెళ్ల దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే ఎందుకు నేటికీ కేటీఆర్ నోరు మెదపలేదన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది మరణిస్తే బాధితులను నాటి సీఎం కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి దురదృష్టకర ఘటన జరిగినా ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్ నాయకులు సహాయక చర్యలు అందించడంలో ముందుంటున్నారని స్పష్టం చేశారు.

అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకొని కాళేశ్వరం కేసులో సీబీఐ ద్వారా కేసీఆర్కు నోటీసులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. సినీ నటుడిగా రాణించి పార్టీ ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఎన్టీ రామారావుకు సైతం ఓటమి తప్పలేదని గుర్తు చేశారు. దేశంలో అత్యంత ప్రమాదకరమైన పార్టీ బీజేపీ అని దళితులు, బీసీల రిజర్వేషన్లను ఎత్తివేయడానికి బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. కరీంనగర్ జ్యువెల్లరీ నిందితులను త్వరలోనే పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply