Air India | తప్పిన ప్రమాదం…

గాల్లో విమానం ఊగిసలాట


ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. పుకెట్‌ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర కుదుపులకు గురైంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

విమానం గాల్లో ఉండగానే తీవ్రంగా ఊగిపోవడంతో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందకు దిగినట్లు సమాచారం. ఈ అనూహ్య పరిణామంతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో మొత్తం 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 10 మంది ప్రయాణికులు, నలుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. అయితే పైలట్ల అప్రమత్తతతో విమానాన్ని సురక్షితంగా దిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్టులోని వైద్య బృందాలు అక్కడికి చేరుకుని గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించాయి. ఘటనపై ఎయిరిండియా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.