Kavitha | సింగరేణి సమస్యలపై కవిత ఫైర్

Kavitha | సింగరేణి సమస్యలపై కవిత ఫైర్

‘కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం’

Kavitha | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: సింగరేణి కార్మికుల సమస్యలపై తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా గోదావరిఖనిలోని 11 ఇంక్లైన్ గనిలో కార్మికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆమె రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.

కార్మికుల కష్టాలు తెలుసుకునేందుకు వస్తే తమను అడ్డుకుంటున్నారని, సింగరేణి యాజమాన్యం పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాలను అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు. కార్మికులకు కనీస భద్రతా పరికరాలు, నాణ్యమైన గ్లౌజులు, షూస్, ఆక్సిజన్ వంటి సౌకర్యాలు కూడా అందడం లేదన్నారు.

సింగరేణి భవిష్యత్తును కాపాడాలంటే కేంద్ర ప్రభుత్వం కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం అండర్‌గ్రౌండ్ మైనింగ్‌ను ప్రోత్సహించాలని కవిత డిమాండ్ చేశారు. ఓపెన్‌కాస్ట్ గనుల కంటే అండర్‌గ్రౌండ్ మైనింగ్ వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు వేలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించిన కవిత, రాష్ట్ర ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

సింగరేణి కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆమె, సింగరేణి నిధులతో నిర్మించిన మెడికల్ కాలేజీలో కార్మికుల పిల్లలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం టీఆర్ఎస్, హెచ్‌ఎంఎస్ కలిసి పోరాటం కొనసాగిస్తాయని, ఎవరైనా కార్మికులను ఇబ్బంది పెడితే తమకు సమాచారం ఇవ్వాలని కవిత పిలుపునిచ్చారు.