ఈ20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ పోరు.. ప్రధాని నివాసానికి మార్చ్

రెండు లక్షలకు పైగా సంతకాలతో మోదీ నివాసానికి ఆప్ అధినేత ర్యాలీ

పెట్రోల్ ధర రూ.84కు తగ్గించాలని విజ్ఞప్తి

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఈ20 (E20) పెట్రోల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి మార్చ్ చేపట్టారు. ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా సేకరించిన రెండు లక్షలకు పైగా ప్రజల సంతకాలను సమర్పించేందుకు సుమారు వందమందితో కలిసి ప్రధాని నివాసానికి బయల్దేరినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఇథనాల్ మిశ్రమం వల్ల వాహనాల మైలేజ్ తగ్గిపోవడంతో పాటు ఇంజిన్‌పై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నిర్వహించిన అధ్యయన నివేదికను వెంటనే ప్రజలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇథనాల్ విధానాన్ని తీసుకురావడం వెనుక కొందరికి ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశం ఉందని ఆరోపించిన ఆయన, ఈ20 పెట్రోల్‌పై వినియోగదారులకు స్వేచ్ఛ ఉండాలని పేర్కొన్నారు. ప్రతి పెట్రోల్ బంకులో సాధారణ (ప్యూర్) పెట్రోల్, ఈ20 పెట్రోల్ రెండింటిలో ఏది కావాలనేది వినియోగదారుడే ఎంచుకునే అవకాశం కల్పించాలని కోరారు. అలాగే, సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఈ20 పెట్రోల్ ధర తక్కువగా ఉండాలని, దేశంలో పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.84కు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.