7thday | సరస్వతి తీరం.. ఆధ్యాత్మిక తరంగం…

7thday | సరస్వతి తీరం.. ఆధ్యాత్మిక తరంగం…
7thday | పుష్కర భక్తితో పరవశించిన కాళేశ్వరం
బ్రహ్మముహూర్తంలో పుణ్యస్నానాలతో వెల్లువెత్తిన భక్తజనం
స్వామీజీల రాకతో క్షేత్రానికి మహాశోభ
నవరత్నమాల హారతితో ఆధ్యాత్మిక తరంగాలు
7thday | మహదేవపూర్, ఆంధ్రప్రభ : దక్షిణకాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా భక్తి పారవశ్యంతో కళకళలాడుతోంది. పుష్కరాల ఏడో రోజు బుధవారం బ్రహ్మముహూర్తం నుంచే వేలాదిమంది భక్తులు పవిత్ర త్రివేణి సంగమానికి చేరుకుని పుష్కర స్నానాలు ఆచరించారు. వేదఘోషలు, శివనామస్మరణలు, హరహర మహాదేవ నినాదాలతో కాళేశ్వరం క్షేత్రమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగిపోయింది.

పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పితృతర్పణాలు, గోదానాలు నిర్వహించి అనంతరం స్వామివారి దర్శనానికి తరలివెళ్లారు. పలువురు భక్తులు పవిత్ర నదికి చీరే సారే సమర్పించి చాట, మొంటేలతో వాయినాలు ఇచ్చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొందరు భక్తులు నదీ తీరంలోని ఇసుకతో సైకత శివలింగాలను తయారు చేసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కుటుంబ సమేతంగా పాల్గొని శివనామస్మరణల మధ్య పూజలు నిర్వహించడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఘాట్ ప్రాంతమంతా సంప్రదాయ ఆచారాలు, భక్తి కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ఆలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, బిల్వార్చనలు వైభవంగా కొనసాగాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సరస్వతీ జలాల్లో స్నానాలు ఆచరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి పీఠాధిపతులు, అవధూత స్వామీజీలు, మఠాధిపతులు కాళేశ్వరం చేరుకుంటుండటంతో క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభ చేకూరుతోంది. ఈ సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ బుధవారం పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామీజీ ఆశీర్వచనాలు పొందేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ఇక సరస్వతీ ఘాట్ వద్ద ప్రతి సాయంత్రం నిర్వహిస్తున్న నవరత్నమాల హారతి పుష్కరాల ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కాశీ గంగా హారతిని తలపించేలా దీపాల కాంతులతో వెలిగిపోతున్న ఘాట్ ప్రాంతం భక్తులను భక్తి లోకంలోకి తీసుకెళ్తోంది. కాశీ నుంచి విచ్చేసిన వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ హారతి కార్యక్రమాన్ని నిర్వహించడంతో నదీతీరం ఆధ్యాత్మిక తరంగాలతో మార్మోగుతోంది. శంఖనాదాలు, మంగళవాద్యాలు, దీపహారతుల వెలుగులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరికథలు, భజనలు, శైవభక్తి గీతాలు, జానపద కళారూపాలు పుష్కరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో క్షేత్రానికి సాంస్కృతిక వైభవాన్ని తీసుకువస్తున్నారు.
పుష్కరాలకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ, షటిల్ బస్సులు, టెంట్ సిటీ, విశ్రాంతి కేంద్రాలు వంటి సదుపాయాలను అధికారులు అందుబాటులో ఉంచారు. వివిధ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు.
సరస్వతీ అంత్య పుష్కరాల నేపథ్యంలో ప్రస్తుతం కాళేశ్వరం భక్తి, భవ్యం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా మారి తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది.

CLICK HERE TO READ ధాన్యం కొనుగోలు పైసలన్నీ కేంద్రానివే.. రాష్ట్ర ప్రభుత్వానిది మధ్యవర్తి పాత్ర
