భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ బోనాల పల్లకి సేవ
వేల్పూర్, ఆంధ్రప్రభ: శ్రావణమాసం సందర్భంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మంగళవారం ఎల్లమ్మ బోనాల పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గీతా కార్మిక సహకార సంఘం ఆధ్వర్యంలో రామాలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు డీజే సౌండ్, భక్తి గీతాలు, ఆటపాటల మధ్య ఊరేగింపు సాగింది. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తలపై బోనాల కుండలు పెట్టుకుని, కాళ్లకు పసుపు రాసుకుని భక్తిశ్రద్ధలతో పల్లకి సేవలో పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, గ్రామ ప్రధాన రహదారుల వెంట సాగిన ఊరేగింపుకు స్థానికులు అడుగడుగునా పూలతో స్వాగతం పలికారు. డీజే పాటల మధ్య యువతులు, మహిళలు కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. కార్యక్రమంలో గీతా కార్మిక సహకార సంఘం సభ్యులు, మహిళలు, చిన్నారులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
