తాగునీటి ఎద్దడిపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తాగునీటి ఎద్దడి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లు, ఇతర నీటి వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు కృష్ణా, గోదావరి నదుల నీటి పరిస్థితిని సీఎంకు వివరించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉందని, ఇటీవల కృష్ణా నదిలో ప్రవాహాలు ప్రారంభమైనట్లు తెలిపారు. గోదావరిలోని వరద పరిస్థితిపైనా సీఎంకు వివరించారు.

కృష్ణా బేసిన్‌కు ఎగువ నుంచి వచ్చే వరద జలాలను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్షాభావం కారణంగా రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశమున్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతపై తరచూ పరీక్షలు నిర్వహించి, ల్యాబ్ నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా రవాణా శాఖలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అనవసర నిబంధనల తొలగింపుపై అధికారులు సీఎంకు వివరించారు. 24 గంటల్లో డీమ్డ్ రిజిస్ట్రేషన్ విధానం, ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్, ఫారం–5బీ వంటి పరీక్షలను తొలగించడం ద్వారా అవినీతిని తగ్గించి ప్రజలకు సులభతర సేవలు అందించవచ్చని తెలిపారు. ఈ సంస్కరణలను దశలవారీగా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

వీలైనంత మేరకు అనవసర నిబంధనలను తొలగించి ప్రజలకు మరింత సులభమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.