కేజీబీవీలో సీటు కావాలంటే లంచం ఇవ్వాల్సిందే !?

గద్వాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ఆరో తరగతి సీటు ఇవ్వాలంటే రూ.30 వేల లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కురువ పల్లయ్య మాట్లాడుతూ, నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాల పిల్లలు కేజీబీవీల్లో చదివి మంచి భవిష్యత్తు సాధించాలని ఆశపడుతుంటే, సీటు కోసం డబ్బులు అడగడం దుర్మార్గమని విమర్శించారు. ఓ తండ్రి తన కుమార్తెకు ఆరో తరగతిలో ప్రవేశం కల్పించాలని ఐజ కేజీబీవీని సంప్రదించగా, రూ.30 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపించారు.

ఈ ఆరోపణలపై జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే జిల్లాలోని పలు కేజీబీవీల్లో నాణ్యమైన విద్య, భోజనం అందడం లేదని, విద్యార్థులు సమస్యలు ప్రస్తావిస్తే వారినే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అందించాల్సిన పలు సౌకర్యాలు, వస్తువులు కూడా పూర్తిస్థాయిలో అందడం లేదని విద్యార్థులు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారి అభిషేక్, యునస్, వెంకటేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.