ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాల ప్రదానం
గండీడ్, ఆంధ్రప్రభ: ప్రతి మనిషి క్రమశిక్షణతో ఎదగాలంటే విద్యే మూలాధారమని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్యకు ప్రత్యామ్నాయం లేదని గండీడ్ గ్రామ సర్పంచ్ భగవంతు రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో ప్రథమ స్థానం సాధించిన కార్తికతో పాటు ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి జిల్లా కలెక్టర్ జారీ చేసిన ప్రశంస పత్రాలను సర్పంచ్ భగవంతు రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణను అలవర్చుకుని లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత విజయాలు సాధించి పాఠశాల, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తిరుపతమ్మ, ఉప సర్పంచ్ చెన్నప్ప, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
