ప్రజల సమస్యల పరిష్కారమే పోలీసుల ప్రాధాన్యం
- 58 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ
- పేపర్‌లెస్ విధానంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం
- త్వరితగతిన, పారదర్శకంగా సమస్యలు పరిష్కరిస్తామని ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ హామీ
ఏలూరు, ఆంధ్రప్రభ: ప్రజల సమస్యలను త్వరితగతిన, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించడమే జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ – ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) వై. ప్రసాద్ రావుతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను నేరుగా కలుసుకుని అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదును ఓపికగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన ఎస్పీ, సమస్యలపై చట్టప్రకారం విచారణ చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విచారణ నివేదికలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.
ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో, ఆధునిక సాంకేతికతతో ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా నిర్వహించారు. కార్యక్రమంలో మొత్తం 58 ఫిర్యాదులు అందగా, వాటిలో భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు తదితర అంశాలకు సంబంధించినవి అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దూర ప్రాంతాల ప్రజలు జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, తమ సమీపంలోని సబ్-డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయాల్లోనే ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని ఎస్పీ సూచించారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవారు ‘మీకోసం’ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఫిర్యాదుల పురోగతిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.
జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా విచారించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ స్పష్టం చేశారు. కార్యక్రమానికి హాజరైన ఫిర్యాదుదారులకు ఏలూరు సత్యసాయి సేవా సమితి సభ్యులు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం విశేషం.
