శ్రావణానికే ఇంద్రకీలాద్రిపై మహా సౌకర్యాలు
- ఆగస్టు 15లోపు ఇంద్రకీలాద్రిపై కొత్త సదుపాయాలు
- దుర్గమ్మ భక్తులకు శుభవార్త.. వేగంగా అభివృద్ధి పనులు
- లడ్డూ పోటు, అన్నప్రసాద భవనాలు సిద్ధం
- శ్రావణ రద్దీకి ముందే ఇంద్రకీలాద్రిపై భారీ ఏర్పాట్లు
- నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండదు
- దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్
- ఈవో వి.కె. శీనా నాయక్తో కలిసి పనుల పరిశీలన
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో నిర్మిస్తున్న నూతన లడ్డూ పోటు, అత్యాధునిక అన్నప్రసాద భవనాల నిర్మాణ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. శ్రావణ మాసంలో పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తూ నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఇంద్రకీలాద్రిపై చేపడుతున్న బృహత్తర అభివృద్ధి పనులను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ సోమవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ జి.వి.ఆర్. శేఖర్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమాదేవితో కలిసి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
నాణ్యతా ప్రమాణాలలో రాజీ ఉండదు..
ఈ సందర్భంగా అత్యంత ప్రాధాన్యతతో నిర్మిస్తున్న నూతన లడ్డూ పోటు (ప్రసాద తయారీ కేంద్రం), అత్యాధునిక సౌకర్యాలతో రూపొందుతున్న అన్నప్రసాద భవనం పనులను ప్రతి అంశంలో క్షుణ్ణంగా పరిశీలించారు. లడ్డూ పోటు భవనంలో నిర్మాణ నాణ్యత, విద్యుదీకరణ పనులు, అన్నప్రసాద భవనంలో భక్తులు సౌకర్యవంతంగా అన్నదానం స్వీకరించేలా కల్పిస్తున్న మౌలిక వసతులపై ఇంజినీరింగ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన కమిషనర్ కె. రామచంద్ర మోహన్, నిర్మాణ పనులు వేగంగా, సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి సివిల్, విద్యుత్, ఇంజినీరింగ్, ఫినిషింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కలిపించడమే లక్ష్యం..
రాబోయే పవిత్ర శ్రావణ మాసంలో కనకదుర్గమ్మ దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరుగుతుందని పేర్కొన్న కమిషనర్, ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెండు నూతన భవనాలను శ్రావణ మాసంలోనే ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అన్నప్రసాద పంపిణీ మరింత వేగవంతంగా, సక్రమంగా నిర్వహించడంతో పాటు లడ్డూల తయారీ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, ప్రసాదాల కొరత లేకుండా భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. పర్యటనలో దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు, సాంకేతిక సిబ్బంది, ఆలయ అధికారులు పాల్గొన్నారు. భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇంద్రకీలాద్రిని ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆధ్యాత్మిక క్షేత్రంగా మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు కొనసాగుతున్నాయని కమిషనర్ తెలిపారు.

