ఎల్ నినో ప్రభావం..
ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన
తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటల సాగుకు వ్యవసాయ అధికారుల సూచనలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం గ్రామపంచాయతీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) వీణా కుమారి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని రైతులు సాంప్రదాయ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే కంది, పెసర, ఆముదం, జొన్నలు, సజ్జలు, కూరగాయల సాగు చేపట్టడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
పుట్టపాకలో రైతులకు అవగాహన కార్యక్రమం
సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక రైతు వేదికలో కూడా నీటి ఎద్దడిని తట్టుకునే పంటలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వ్యవసాయ అధికారిణి పూజ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపాలని సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే కంది, పెసర, ఆముదం, జొన్నలు, సజ్జలు వంటి ఆరుతడి పంటలతో పాటు కూరగాయలు, ఆయిల్ పామ్ సాగు కూడా లాభదాయకమని తెలిపారు.
భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి యాజమాన్య పద్ధతులను పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా నష్టాలను నివారించవచ్చని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో అనురాధ, వ్యవసాయ శాఖ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.
