ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం..
ఇంటింటికీ ప్రభుత్వ విజయాలు చేర్చాలి
టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ
45 రోజుల ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
సూపర్ సిక్స్, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
రెండేళ్లలో సంక్షేమం–అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం కీలక విజయాలు
వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడింది
కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలకు కార్యాచరణపై జిల్లా అధ్యక్షురాలు దిశా నిర్దేశం
(విజయవాడ ఆంధ్రప్రభ) : ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను 45 రోజుల ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి చేరవేయాలని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడ ఆటోనగర్‌లోని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విజయవాడ పార్లమెంట్ (ఎన్టీఆర్ జిల్లా) పార్టీ కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. 45 రోజుల ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

అలాగే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, రూ.4 వేల సామాజిక పింఛన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు పెట్టుబడి సాయం, చేనేత కార్మికులు, మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలు వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ సమస్యలను గుర్తించి రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. సమావేశం ప్రారంభానికి ముందు జిల్లా పార్టీ కార్యదర్శి బొడ్డుకుల్ల ప్రేమరాజు మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.
అభివృద్ధి సంక్షేమం ప్రజల్లోకి తీసుకువెళ్లాలి..
జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్ధ వెంకన్న మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి ఎం.ఎస్. బేగ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నిబోయిన చిట్టిబాబు, కార్పొరేషన్ చైర్మన్లు ఎరుబోతు రమణారావు, పేరేపి ఈశ్వర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, రాష్ట్ర కార్యదర్శి శిరీష గాంధీ మాట్లాడుతూ… సూపర్ సిక్స్ హామీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని సూచించారు. అలాగే అమరావతి, పోలవరం, భోగాపురం వంటి అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్ర పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
