కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త కలకలం
- అసంతృప్త ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్‌కు కొత్త సవాల్
బెంగళూరు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. మంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ నాయకుడు యశ్వంతరాయ పాటిల్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే బెలూరు ఎమ్మెల్యే గోపాలకృష్ణ కూడా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన యశ్వంతరాయ పటిల్, “నాకు పార్టీ నాయకత్వం తీవ్రంగా నిరాశ కలిగించింది. ఇది కేవలం మంత్రి పదవి విషయం మాత్రమే కాదు. కొంతకాలంగా పార్టీ వ్యవహరిస్తున్న తీరు బాధ కలిగించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను” అని వెల్లడించారు.
12 మందికి పైగా ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం
బెంగళూరులోని డాలర్ కాలనీలో సీనియర్ ఎమ్మెల్యే పీ.వి. జయచంద్ర నివాసంలో సోమవారం జరిగిన రహస్య సమావేశంలో ఈ అసంతృప్తి బహిర్గతమైంది. ఈ సమావేశానికి 12 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తుది మంత్రివర్గ జాబితాలో చోటు దక్కని ఆశావహులు తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సీనియర్ నేతలు హెచ్.కే. పాటిల్, దినేష్ గుండు రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కేబినెట్లో చోటు దక్కని వారితో పాటు, ఇప్పటికే మంత్రి అయిన సీనియర్ నేత కె.హెచ్. మునియప్ప కూడా తనకు కేటాయించిన శాఖపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు మరో శాఖ ఇవ్వాలని ఆయన పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్ గాంధీతో కూడా ప్రస్తావించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
చివరి నిమిషంలో మారిన జాబితా
డీకే శివకుమార్ ప్రభుత్వం చేపట్టిన కేబినెట్ విస్తరణలో చివరి నిమిషంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలుత జాబితాలో ఉన్న మంకల్ వైద్య, గాయత్రి చంద్రశేఖర్ పేర్లు చివరి క్షణంలో తొలగించగా, సీనియర్ నేత ఎస్.ఎస్. మల్లికార్జునకు అవకాశం లభించింది.
బీజేపీ విమర్శలు
కేబినెట్ విస్తరణను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. పార్టీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వియా మాట్లాడుతూ, కాంగ్రెస్ సామాజిక న్యాయం, యువతకు ప్రాధాన్యం, సమగ్ర ప్రాతినిధ్యం వంటి హామీలను నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు. కొత్త మంత్రివర్గంలో ఒక్క మహిళకు మాత్రమే అవకాశం కల్పించడం, యువ నేతలను పక్కన పెట్టడం, బ్రాహ్మణ వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడం, వివాదాల్లో ఉన్న నేతలకు చోటు కల్పించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ మంత్రివర్గం కాంగ్రెస్ ప్రకటించిన విలువలకు విరుద్ధంగా ఉందని ఆయన విమర్శించారు.
