Kondapalli dolls | నైపుణ్యాభివృద్ధి, మార్కెట్ అనుసంధానానికి మద్దతు
- జీఐ ట్యాగ్ కళాకారులకు ఎగుమతి అవకాశాల విస్తరణ
- ప్రపంచ మార్కెట్‌కు కొండపల్లి కళను చేర్చే చర్యలు
- డీఈహెచ్ పథకంతో ఎగుమతి అవకాశాలకు కొత్త ఊపు
- కళాకారులకు శిక్షణ, మార్కెటింగ్, ఎగుమతులకు అండ
- ఎగుమతులు పెంచి కళాకారుల ఆదాయం పెంపే లక్ష్యం
- ఎంపీ కేశినేని చిన్ని ప్రశ్నకు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ సమాధానం
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: దేశ ఎగుమతి వృద్ధిలో ప్రతి జిల్లాను క్రియాశీలక భాగస్వామిగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని జీఐ ట్యాగ్ పొందిన కొండపల్లి బొమ్మల ఎగుమతి ప్రోత్సాహం, కళాకారులకు అందుతున్న మద్దతు, కేంద్ర పథకాల అమలుపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
‘జిల్లాలను ఎగుమతి కేంద్రాలుగా’ (డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్‌పోర్ట్ హబ్స్–డీఈహెచ్) తీర్చిదిద్దే కార్యక్రమాన్ని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్‌టీ) ద్వారా అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర ఎగుమతి ప్రోత్సాహక కమిటీలు, జిల్లా స్థాయిలో జిల్లా ఎగుమతి ప్రోత్సాహక కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 734 జిల్లాల్లో ఎగుమతి సామర్థ్యం కలిగిన ఉత్పత్తులు, సేవలను గుర్తించినట్లు, 590 జిల్లాలకు జిల్లా ఎగుమతి కార్యాచరణ ప్రణాళికలు (డీఈఏపీ) సిద్ధం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) పథకానికి అనుబంధంగా పనిచేస్తూ, స్థానిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తుందని వివరించారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన జీఐ ట్యాగ్ పొందిన కొండపల్లి బొమ్మల ఎగుమతి సామర్థ్యాన్ని జిల్లా ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సంప్రదింపుల ద్వారా అంచనా వేసినట్లు తెలిపారు. ఈ క్లస్టర్‌కు అవసరమైన ముడి పదార్థాల లభ్యత, ఉత్పత్తి రూపకల్పన, నాణ్యత ధ్రువీకరణ, ప్యాకేజింగ్, కొనుగోలుదారులతో అనుసంధానం వంటి అంశాలపై జిల్లా ఎగుమతి కార్యాచరణ ప్రణాళికలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న సాంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవన నిధి (ఎస్‌ఎఫ్‌యూఆర్‌టీఐ) పథకం కింద కొండపల్లి చెక్క బొమ్మల క్లస్టర్‌కు ఉమ్మడి సౌకర్య కేంద్రం, ఉత్పత్తి మౌలిక సదుపాయాలు, టూల్‌కిట్లు, నైపుణ్యాభివృద్ధి, మార్కెట్ అనుసంధానానికి అవసరమైన మద్దతు కల్పించినట్లు మంత్రి వివరించారు. అదేవిధంగా జాతీయ హస్తకళల అభివృద్ధి కార్యక్రమం, సమగ్ర హస్తకళల క్లస్టర్ అభివృద్ధి పథకం ద్వారా కళాకారులకు డిజైన్ అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన శిక్షణ, దేశీయ, అంతర్జాతీయ ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
హస్తకళల ఎగుమతి ప్రోత్సాహక మండలి ద్వారా అంతర్జాతీయ ప్రదర్శనలు, రివర్స్ బయ్యర్–సెల్లర్ సమావేశాలు, ఇండియా టాయ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు, డీజీఎఫ్‌టీ ‘నిర్యాత్ బంధు’ పథకం ద్వారా తొలి ఎగుమతిదారులకు మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం)లో ఓడీఓపీ స్టోర్‌ఫ్రంట్, ఈ-కామర్స్ అనుసంధానం, విదేశాల్లోని భారత మిషన్ల ద్వారా మార్కెట్ అవకాశాలను కల్పిస్తున్నట్లు, కొండపల్లి కళాకారులకు జీఐ అధీకృత వినియోగదారు నమోదు, ‘పెహచాన్’ కార్డు నమోదుకు కూడా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
