ఎన్ఆర్ఐలకు భట్టి పిలుపు : భ‌ట్టి

3 ట్రిలియన్ డాలర్లే లక్ష్యం
ఏటీఏ వేదికగా భట్టి ప్రసంగం
ఎన్ఆర్ఐలకు సింగిల్ విండో
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి

హైదరాబాద్, ఆంధ్రప్రభ: అమెరికాలోని బాల్టిమోర్‌లో నిర్వహించిన 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఏటీఏ) జాతీయ మహాసభల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులు కీలక పాత్ర పోషించాలని కోరారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఎన్ఆర్ఐలకు సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్), ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ప్రవాస భారతీయులు పెట్టుబడులు పెట్టి భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.

ఎన్ఆర్ఐలు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నామని భట్టి వెల్లడించారు. అలాగే ప్రవాస భారతీయులు తమ ఓటరు నమోదు సహా ఇతర ఎన్నికల సంబంధిత వివరాల కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ), తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి అధికారిక వెబ్‌సైట్లను వినియోగించాలని సూచించారు.

ప్రపంచ స్థాయిలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లే ఈ అభివృద్ధి ప్రయాణంలో ప్రవాస భారతీయులు తమ అనుభవం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.